సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సబ్ ప్లాన్ పేరిట బీసీలను మరోసారి మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలను వంచన చేయడం కోసమే సబ్ ప్లాన్ బిల్లును ప్రవేశపెట్టారని మండిపడ్డారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యమంత్రిగాని, ఆర్థికమంత్రిగాని సభలో లేరంటేనే బీసీల పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందని విమర్శించారు. బీసీ బిల్లు అనేది ఓ నాటకమని ఆయన ఆరోపించారు.
టీడీపీకి బీసీలే వెన్నుముక అంటూ వాళ్లని ఓటు బ్యాంక్‌గా వాడుకోవడం తప్పితే మరోటికాదన్నారు. ఏపీ బడ్జెట్‌లో ఖర్చులు మాత్రమే ఉంటున్నాయని కానీ కేటాయింపులు కానరావడం లేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకు సబ్ ప్లాన్ బిల్లుపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు ఎంత కేటాయించారో మంత్రి చెప్పలేకపోవడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ ప్రభుత్వ నాటకాలన్నీ తెరదించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏ విధంగా దారిమళ్లించారో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తేలుస్తామని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment