సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నిప్పులు చెరిగారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేస్తున్న హడావుడి విడ్డూరంగా ఉందని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇప్పడు నీకు ఇబ్బంది వస్తే ఇతరులు కావాలా’ అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే... డీజీపీతో తప్పుడు ప్రకటనలు చేయించారని అన్నారు. అవినీతిపై మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కుట్రలు కుతంత్రాలే ఉన్నాయని అన్నారు.
110 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?
చంద్రబాబు బీసీ ద్రోహి కృష్ణమూర్తి వాఖ్యానించారు. బీసీలకు ఇచ్చిన 110 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే బాబు బీసీల వైపు చూస్తారని విమర్శలు గుప్పించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై ప్రేమే ఉంటే బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చుచేయలేదని ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్ ఏమైందని మండిపడ్డారు. వెనబడిన తరగతులకు ఇచ్చిన హామీలపై చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ఊసరవెళ్లిలా రంగులు మార్చే చంద్రబాబు నిజస్వరూపం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment