చంద్రగిరి, న్యూస్‌లైన్: చంద్రగిరికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాను శేఖర్‌బాబు(36) గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవలే ఆయన ఎన్‌డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్కూ ఫోర్స్)కు డెప్యుటేషన్‌పై బీహార్‌కు వెళ్లారు. గతనెల 31వ తేదీ రాత్రి 11గంటల సమయంలో చాతీలో నొప్పిగా ఉన్నట్లు సహచర జవాన్లకు తెలిపాడు. అక్కడి అధికారులు వెంటనే అంబులెన్స్‌లో పాట్నాలోని నలంద మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని 13మంది సైనికులు ఆదివారం అర్ధరాత్రి చంద్రగిరిలోని ఆయన ఇంటికి తీసుకువచ్చారు.
అధికార లాంచనాలతో అంత్యక్రియలు
జవాను శేఖర్‌బాబు భౌతికకాయూనికి బీఎస్‌ఎఫ్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్‌ఎఫ్ అధికారి రథన్‌సింగ్ జోరా ఆధ్వర్యంలో ఎస్‌ఐ స్థాయి అధికారి ఎ.ఫాతిమరాజ్‌తో పాటు 11మంది జవాన్లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శేఖర్‌బాబు కుటుంబసభ్యుల కోరిక మేరకు ముఖం కనబడేటట్లుగా శవపేటికను తెరచిపెట్టారు. హిందూ సంప్రదాయం ప్రకారం సైనిక లాంచనాలతో ఖననం చేశారు. కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. ఏఆర్ పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.