
గ్రామంలోకి చొచ్చుకు పోయిన సెల్‌ఫోన్
కడప కల్చరల్: జిల్లాకు చెందిన చిత్ర, శిల్పకారుడు, రాష్ట్ర ప్రభుత్వ కళారత్న (హంస) పురస్కార గ్రహీత గొల్లపల్లి జయన్న శిల్పకళా ప్రదర్శన నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండో రోజు ఆదివారం నగరం నలుమూలల నుంచి కళాభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రదర్శనను తిలకించారు. పల్లెటూరు, బాల్యాన్ని ఈ శిల్పాలు మళ్లీ గుర్తుకు తెచ్చాయని, ఆ అనుభూతిని అందించినందుకు జయన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జయన్నను ‘సాక్షి’ పలుకరించింది.
♦ ప్రదర్శనకు ఆదరణ ఎలా ఉంది?
మనవైపు శిల్పకళ తక్కువేనని చెప్పాలి. ప్రసార మాధ్యమాల ద్వారా శిల్పకళకు మంచి ఆదరణ ఉంది. రెండు రోజులుగా పాఠశాల, కళాశాలల విద్యార్థులే కాకుండా నగర వాసులు కుటుంబాలతో కలిసి వస్తుండడంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
♦ పుట్టిన గడ్డపై తొలి ప్రదర్శన..మీ అనుభూతి ఎలా ఉంది?
చాలా రోజులుగా జిల్లాలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయాలని చూశాను. ఇప్పుడు అవకాశం లభించింది. శిల్పాలను చూసిన వారు జయన్న మన జిల్లా వాడా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రాంతానికి శిల్పం అరుదైన కళా ప్రక్రియ గనుక కాస్త కొత్తగా అనిపిస్తోంది.
♦ పేదరికం నేపథ్యం నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు?
బద్వేలులోని కుగ్రామంలో పేద కుటుంబంలో పుట్టాను. చదువు, బతుకుదెరువు కోసం బద్వేలు పట్టణంలో సైన్‌బోర్డులు, బ్యానర్లు రాసేవాడిని. కళ, విద్య దాహం తీరక హైదరాబాదుకు చేరి జర్నలిజం, శిల్పంతోపాటు సాధారణ డిగ్రీ కూడా చేశాను. వృత్తి రీత్యా పలు రాష్ట్రాలు తిరగడంతో శిల్పకళలో వైచిత్రిని తెలుసుకున్నా. నా శిల్పాలన్నీ పల్లెటూరిని ప్రతిభింబిస్తాయి
♦ జిల్లాలో తర్వాత ప్రదర్శన ఎక్కడ?
చర్చలు జరుగుతున్నాయి. త్వరలో తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా కొండవీడులో కూడా ప్రదర్శన నిర్వహించాలని కోరుతున్నారు.
♦ యువ శిల్పకారులకు మీ సందేశం ?
సందేశం ఇచ్చే అంతడి వాడిని కాను. జిల్లాలో కవులు, కళాకారులకు కొదవ లేదు. అవకాశాలు లేకనే అభివృద్ధికి నోచుకోవడం లేదు. వైవీయూ రాకతో ఇక ఆ కొరత తీరుతుంది. పట్టుదలతో శ్రమిస్తే ఫలితం తప్పక లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment