ఎవరేమనుకున్నా మేమింతే! | jc diwakar reddy brothers controversies | Sakshi
Sakshi News home page

ఎవరేమనుకున్నా మేమింతే!

Published Fri, Jun 16 2017 10:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

ఎవరేమనుకున్నా మేమింతే!

ఎవరేమనుకున్నా మేమింతే!

నిత్యం ఏదో ఒక వివాదంలో జేసీ బ్రదర్స్‌
ప్రజాప్రతినిధులమనే సంగతి మరిచి దురుసు ప్రవర్తన
సామాన్యులపై చేయి చేసుకోవడం, బెదిరించడమే నైజం
విమానాశ్రయాల్లో దివాకర్‌రెడ్డి వీరంగాలు
భూకబ్జా కేసులో ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి అరెస్టు
దీపక్‌రెడ్డి దందాలకు జేసీ సోదరుల సహకారం


జేసీ బ్రదర్స్‌... రాజకీయాల్లో వీరు అదో టైపు! నోటికి ఏదొస్తే అది మాట్లాడడం.. సామాన్యులపై చేయి చేసుకోవడం, బెదిరించడం వీరి నైజం! నిత్యం ఏదో ఒక వివాదంలో, వార్తల్లో ఉండడం పరిపాటే. ఎవరేమనుకున్నా వీరు తీరు మార్చుకోరు. జేసీ బ్రదర్స్‌తోపాటు తాజాగా వారి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. తెలంగాణలో భూకబ్జా కేసులో అరెస్టయిన దీపక్‌రెడ్డిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు వేయడం, అదేరోజు విశాఖపట్నం ఏయిర్‌పోర్టులో జేసీ దివాకర్‌రెడ్డి వీరంగం సృష్టించడంతో జేసీ ఫ్యామిలీ, వారి వ్యవహార శైలి అనంతపురం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గన్నవరం ఎయిర్‌పోర్టులోనూ చిందులు
అనంతపురంలో ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కొద్దినెలల క్రితం హల్‌చల్‌ చేశారు. తాడిపత్రి నుంచి భారీగా జనాలను రప్పించి నాలుగు రోజులపాటు నగరంలో కలియతిరిగారు. ప్లాస్టిక్‌ కవర్లు వాడుతున్న వ్యాపారులను ఇష్టానుసారంగా దూషించారు. నోటికి ఎంతమాట వస్తే అంత అనేశారు. కొంతమందిపై చేయి కూడా చేసుకున్నారు. కొన్ని దుకాణాలకు తాళాలు వేశారు. వారం రోజులపాటు తాళాలు తిరిగి ఇవ్వలేదు. దివాకర్‌రెడ్డి వైఖరిపై అనంతపురం జిల్లాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గతంలో గన్నవరం విమానాశ్రయంలో చిందులు తొక్కారు. ఆలస్యంగా వచ్చారనే కారణంతో బోర్డింగ్‌పాస్‌ ఇవ్వకపోవడంతో సిబ్బందిపై వీరంగం వేశారు. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలోనూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అలాగే ప్రవర్తించారు.
 
సోదరుడి వైఖరీ అంతే
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇతను కూడా తాను ప్రజాప్రతినిధి అనే విషయం మరిచిపోయి మాట్లాడుతుంటారు. తోటి ప్రజాప్రతినిధుల గురించి ఏకవచనంలో సంబోధిస్తుంటారు. ఇటీవల తెలంగాణకు సంబంధించిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సులను అనంతపురం రూట్‌లో నిలిపేస్తున్నారని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌ ఆర్టీఏ కార్యలయానికి వెళ్లి వీరంగం సృష్టించారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అనంతపురం బైపాస్‌ రోడ్డులో టెంటు వేసి విపక్ష నేతను దుర్భాషలాడారు.

దీపక్‌రెడ్డి చరిత్ర నేరమయం
జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తే. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఇతడు 2012లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచాడు. తనకు రూ.6,781.05 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొని ఒక్కసారిగా జాతీయస్థాయిలో వార్తల్లోకెక్కాడు. రూ.వేల కోట్ల ఆస్తులను అఫిడవిట్‌లో చూపించిన వారు రాష్ట్రంలో ఎవరూ లేరు. బహుశా దేశంలోనే లేరేమో! ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైదరాబాద్‌లోనే రూ.15,000 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి చాలాచోట్ల ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కబ్జాలు, సెటిల్‌మెంట్లతో రూ.వేల కోట్ల ఆస్తులను ఆక్రమంగా సంపాదించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలకు పాల్పడడం, దాడి చేయడం, మారణాయుధాలు కలిగి ఉండడం వంటి కారణాలతో కేసులు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దీపక్‌రెడ్డిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. దీపక్‌రెడ్డి చేసిన సెటిల్‌మెంట్లకు జేసీ బ్రదర్స్‌తోపాటు జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కూడా సహకరించినట్లు తెలుస్తోంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement