టికెట్ కొన్నాక కొత్త రైలొస్తే ఏం లాభం?
రాయదుర్గం : రైలులో వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ తీసుకుని ప్లాట్ఫాం మీదకు వచ్చిన తరువాత కొత్త రైలు వస్తోందంటే ఎలా ఎక్కుతారని మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆలస్యంగా పార్టీని ప్రకటించారని, దీని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలో టికెట్లను ఆశించి, రానివారు మాత్రమే కిరణ్ పార్టీలో చేరతారన్నారు.
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయింది. ఇంకా ఏం మిగిలిందని కిరణ్ కొత్త పార్టీ స్థాపిస్తున్నారు' అని దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇల్లు అలకగానే పండుగ కాదు, అనంతపురం జిల్లాలో ఆ పార్టీని కనీసం రెండు సీట్లు గెలవమనండి చూద్దాం అని సవాల్ విసిరారు.
గ్రౌండ్ వర్క్ లేకుండా ఊహాగానాలతో ముందుకు వెళితే మంచిది కాదని హితవు పలికారు. విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ దుర్గతి పాలైందన్నారు. తాను టీడీపీలో చేరుతున్నది వాస్తవమేనన్నారు. తనవెంట ఎవరు వస్తారో తెలుసుకోవాడానికి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు.