kiran new political party
-
టికెట్ కొన్నాక కొత్త రైలొస్తే ఏం లాభం?
రాయదుర్గం : రైలులో వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ తీసుకుని ప్లాట్‌ఫాం మీదకు వచ్చిన తరువాత కొత్త రైలు వస్తోందంటే ఎలా ఎక్కుతారని మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆలస్యంగా పార్టీని ప్రకటించారని, దీని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలో టికెట్లను ఆశించి, రానివారు మాత్రమే కిరణ్ పార్టీలో చేరతారన్నారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయింది. ఇంకా ఏం మిగిలిందని కిరణ్ కొత్త పార్టీ స్థాపిస్తున్నారు' అని దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇల్లు అలకగానే పండుగ కాదు, అనంతపురం జిల్లాలో ఆ పార్టీని కనీసం రెండు సీట్లు గెలవమనండి చూద్దాం అని సవాల్ విసిరారు. గ్రౌండ్ వర్క్ లేకుండా ఊహాగానాలతో ముందుకు వెళితే మంచిది కాదని హితవు పలికారు. విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ దుర్గతి పాలైందన్నారు. తాను టీడీపీలో చేరుతున్నది వాస్తవమేనన్నారు. తనవెంట ఎవరు వస్తారో తెలుసుకోవాడానికి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు. -
కిరణ్ పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర'
-
కిరణ్ పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర'
హైదరాబాద్: తాను పెట్టబోయే పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర' అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. తెలుగు ప్రజలను కలుపుకుని పోయేలా పార్టీ ఉంటుందని అన్నారు. తెలుగు జాతికి మేలు చేయడం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు.ఆత్మగౌరవంతో ఓటు వేయాలనుకునే వారి కోసం పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం పనిచేసిన వారందరినీ పార్టీలో చేర్చకుంటామన్నారు. పిరికితనమున్న చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు అవమానకరమన్నారు. విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబేనని అన్నారు. విభజన ద్వారా తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది చంద్రబాబే అన్నారు. తెలుగువారికి కాంగ్రెస్, బీజేపీ తీవ్ర అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు. లాభనష్టాలు ఆలోచించకుండా విభజన చేశారని విమర్శించారు. తెలుగు జాతికి అన్యాయం చేసిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగకూడదన్న ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు. తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. -
కిరణ్ సభకు ఆదిలోనే హంసపాదు
రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభకు జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. ఈనెల 12వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో పార్టీ పేరు సహా జెండా, ఏజెండా ప్రకటిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సభకు అనుమతి లేకపోవటంతో కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో బహిరంగ సభ ఏర్పాట్లలో నిమగ్నమైన ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్లు సభా స్థలిని మార్చే ఆలోచనలో ఉన్నారు. కాగా సభ ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. -
కిరణ్ కొత్త పార్టీ
* ఎట్టకేలకు ప్రకటించిన మాజీ సీఎం * 12న రాజమండ్రి సభలో పార్టీ పేరు, విధానాల ప్రకటన * తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యం * కిరణ్ వెంట నలుగురు కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు, ఓ మాజీ మంత్రి సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న రాజమండ్రి బహిరంగ సభలో కొత్తపార్టీ పేరు, విధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే పార్టీ పెడుతున్నామని, పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తన ప్రైవేటు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కొత్త పార్టీ గురించి ప్రకటన చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్కృత ఎంపీల్లో కేవలం నలుగురు (లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్), మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి మాత్రమే ఉన్నారు. కిరణ్ చెప్పిన మాటలు నమ్మి సొంతపార్టీని వీడి ఆయన వెంట నడిచిన నాయకులు తమ పరిస్థితి ఎటూ కాకుండాపోతోందని ఒత్తిడిచేయడంతో ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆయనేమన్నారంటే... * రాష్ట్ర విభజన ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీలు దెబ్బతీశాయి. బిల్లు రూపొందించిన తీరు, పార్లమెంటులో అప్రజాస్వామికంగా ఆమోదించిన విధానం సిగ్గుచేటు. * అధికార దాహంతోనే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయి. ఇద్దరూ విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. బాబు, జగన్‌లకు సీఎం పదవిలోకి ఏదోవిధంగా రావాలన్నదొక్కటే లక్ష్యం. * పురుడుపోసి తల్లిని చంపేశారని మోడీ చెబుతున్నారు. నలుగురు ఎంపీలు పోడియంలోకి వెళ్తే హృద యం గాయపడింద ని ప్రధాని అంటున్నారు. కానీ వీరెవ్వరూ తెలుగు ప్రజల గుండెకు తగిలిన గాయం గురించి ఆలోచించలేదు. * ప్రస్తుతం ఎన్నికల సంఘం కొత్తగా ‘నోటా’ (పైవారెవ్వరూ కాదు అన్న ఆప్షన్) పెడుతున్నందున రాష్ట్ర ప్రజలంతా ఆయా పార్టీలకు కాకుండా నోటాపై ఓటువేసే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి వారందరికీ విన్నవిస్తున్నాను. మీ ఆలోచనల మేరకు నడిచే, మీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు కొత్త పార్టీ పెడుతున్నాం. ‘నోటా’కు బదులుగా మాకు ఓటేయండి. * రాజమండ్రి బహిరంగసభలో పార్టీపేరు, విధానాలు, అధ్యక్షుడితోపాటు అన్ని విషయాలూ చెబుతాం. సీమాంధ్రతోపాటు, తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తాం. * నా జీవితం తెరచిన పుస్తకం. నాపై ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నాను. నేను చేసిన ప్రతి నిర్ణయం చట్టం, నిబంధనల ప్రకారమే జరిగింది. గవర్నర్‌కే కాదు ఎక్కడైనా ఫిర్యాదులు ఇచ్చుకోనివ్వండి. నన్నెవరూ ఏమీ చేయలేరు. * సీఎం నిర్ణయాలు తిరగదోడేందుకు గవర్నర్ ఎవరు? వచ్చే ప్రభుత్వాలు తిరగదోడొచ్చేమో కానీ గవర్నర్ ఎవరు? తిరగదోడితే మాత్రం ఏమవుతుంది? ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మంచిది. * రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా. ఏమవుతుందో చూడాలి. మాకు అన్ని పార్టీలూ ప్రధాన పోటీదారులే. * ఒకప్పుడు వేర్వేరుగా ఉన్న ఉభయ జర్మనీ దేశాలు గోడలు పగులకొట్టి మరీ ఏకంకాలేదా? ఇక్కడ అలా గోడలు కూడా లేవు కదా? -
'మీరు వెళితే వెళ్లండి...మేము రాము'
అమలాపురం : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ యత్నాలకు ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఆ పార్టీపై ఆశలు పెట్టుకుని సొంత పార్టీని ధిక్కరించి బహిష్కరణకు గురైన నేతలకు దిక్కు తోచటం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీని నమ్ముకుని సొంత పార్టీని ధిక్కరించిన ఎంపీ హర్షకుమార్ రెంటికీ చెడ్డ రేవడిలా మారుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి రోజులు గడుస్తున్న కొద్దీ కిరణ్ పార్టీ పెడతారనే నమ్మకం సన్నగిల్లుతుండగా, తన వెంట వస్తారని భావించిన కాంగ్రెస్ క్యాడర్ మొండిచేయి చూపడంతో హర్షకుమార్ తలపట్టుకుంటున్నారు. 'మీరు వెళితే వెళ్లండి...మేము రాము' అని వారు తెగేసి చెప్పడంతో హర్షకుమార్కు ఎటూ పాలుపోవడం లేదు. తాజాగా కిరణ్ పార్టీలోకి కాంగ్రెస్ వాదులను రప్పించేందుకు హర్ష తనయుడు సుందర్ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. బొడసకుర్రు వంతెన ప్రారంభోత్సవానికి ఆహ్వానించే పేరుతో సుందర్ గత రెండు రోజులుగా రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి కిరణ్ పార్టీ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రభావం ఉంటుందని ఆరా తీశారు. పనిలోపనిగా మీరు కూడా కిరణ్ పార్టీలోకి రావాల్సిందిగా కోరారు. 'కిరణ్ పార్టీకి ప్రజల్లో అసలు ఆదరణ ఉండదు. 'మీరు వెళితే వెళ్లండి... మేము మాత్రం రాము' అని తెగేసి చెప్పటంతో సుందర్ విస్తుపోయినట్లు సమాచారం. తండ్రి కోసం తనయుడి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో భవిష్యత్ కార్యాచరణపై మల్లాగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. -
'వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది'
బొబ్బిలి : కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టినా.. దాని ప్రభావం పెద్దగా ఉండదని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. బుధవారం ఆమె బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏది చేయడానికైనా హక్కు ఉందన్నారు. అయితే సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కిరణ్ సీఎం అయ్యారు కనుక దాన్ని గుర్తుపెట్టుకుంటేనే మనుగడ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం వాల్తేరును రైల్వే జోన్‌గా చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను రాజధాని చేయాలని, సీమాంధ్రకు విద్య, ఉపాధి, వైద్యం, సాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. -
కిరణ్ పార్టీలోకి వెళ్లను: రాంచంద్రయ్య
నెల్లూరు: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే తాము వెళ్లబోమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రాంచంద్రయ్య తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు 4 సీట్లు సంపాదించుకునేందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలవారు తెలుగువారి భవిష్యత్తును నిర్ణయించడం సరికాదని మంత్రి కాసు కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో అన్నారు. సీఎం కిరణ్ రాజీనామాపై ఇప్పుడే మాట్లాడడం అపరిపక్వత అవుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలన్నీ రాష్ట్ర విభజన విషయంలో కేంద్రాన్ని మోసం చేశాయని మంత్రి రఘువీరా రెడ్డి అనంతపురంలో అన్నారు. పార్టీలన్నీ కలసివెళ్లి ప్రధానిని కలిసి మొరపెట్టుకుంటే రాష్ట్ర విభజన ఆగిపోతుందన్నారు. -
ఢిల్లీ డ్రామా షురూ!
-
ఢిల్లీ డ్రామా షురూ!
* కిరణ్ నేతృత్వంలో ‘కొత్త పార్టీ’ * అంతా అధిష్టానం ఆదేశానుసారమే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరో డ్రామాకు శ్రీకారం చుట్టింది. అంతర్గతంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తూ, పైకి మాత్రం సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఈ కొత్త నాటకానికి తెర లేపుతోంది. తన ఆదేశాలను తు.చ. తప్పకపాటిస్తూ, రాష్ట్ర విభజనను చివరి అంకంవరకు తీసుకొచ్చిన కిరణ్‌ను ఇప్పుడు సమైక్య నినాదం ముసుగులో జనంలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సమైక్యం పేరుతో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. సీమాంధ్ర జిల్లాల్లో కొద్ది రోజులుగా దర్శనమిస్తున్న ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులన్నీ అధిష్టానం మొదలుపెట్టిన కొత్త డ్రామాలో అంకమేనన్న విషయం మరో నాలుగు రోజుల్లో ప్రజల ముందు బహిర్గతం కానుంది. త్వరలో ముసుగును తొలగించి కొత్త నాటకంలో తన పాత్రలోకి ప్రవేశించేందుకు కిరణ్‌కు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఆయన సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చను సాఫీగా ముగించి, బిల్లు రాష్ట్రపతికి చేరేలా మార్గాన్ని సుగమం చేశాక కిరణ్ ద్వారా కొత్త పార్టీకి అంకురార్పణ చేయించడమే కొత్త నాటకంలో ప్రధానాంశంగా తేలుతోంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలే అందుకు వేదికగా మారనున్నాయి. శుక్రవారం నుంచి, అసెంబ్లీ సమావేశాలు ముగిసే 23వ తేదీ దాకా సమైక్య ప్రచారాన్ని కిరణ్ ముమ్మరం చేస్తారు. ఆ వెంటనే పార్టీ ప్రకటన వంటి పరిణామాలూ ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఉన్నాయని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎనిమిది రోజులూ సభ లోపల, బయట కిరణ్ సమైక్యవాదాన్ని వినిపించడంతో పాటు అందుకు పెద్ద ఎత్తున ప్రచారం లభించేలా రంగం చేశారు. ఆది నుంచీ... విభజన కీలక దశలకు ముందు కిరణ్‌కు వాటినే ప్రస్తావిస్తూ, అవి సాధ్యం కానే కావని చెప్పడం, ఆ తరవాత సరిగ్గా అదే దిశగా కేంద్రం చర్యలను పూర్తి చేయడం జరిగిపోతూ వచ్చాయుని గుర్తు చేసుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలను శిరసావహించి వచ్చినందునే కిరణ్ కోర్‌కమిటీలో తానేం మాట్లాడానో మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా, సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపించినట్లుగా బయుటకు మాత్రం లీకులు ఇప్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంతోపాటు యూపీఏ భాగస్వామ్యపక్షాల సమావేశాన్నీ నిర్వహించి వారి ఆమోదాన్నీ తీసుకుంది. ఈరెండు సమావేశాలు గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే సమైక్యవాదంపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడిగా కిరణ్‌కువూర్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి ఉండేవారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత పది రోజుల పాటు ఏమీ మాట్లాడకుండా సీఎం వనం దాల్చారు. పెద్ద ఎత్తున ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఆ తరువాత మీడియా సమావేశం పెట్టి నింపాదిగా సమస్యలు ఏకరవు పెడుతూ విభజన ఎలా చేస్తారంటూ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లుగా మాట్లాడారు. తాను చెప్పే సమస్యలను తీర్చాకనే విభజన చేయాలన్నారు. అది పార్టీ నిర్ణయమే తప్ప కేంద్రం నిర్ణయం కాదని, కేంద్రం రాష్ట్ర విభజనపై అంత త్వరగా నిర్ణయం తీసుకోలేదన్నారు. విభజనకు కారణాలు చూపే పీఠికను రూపొందించడమే కష్టమని చెబుతూ వచ్చారు. తీరా కేంద్ర హోం శాఖ తెలంగాణ నోట్‌ను రూపొందించడంతోపాటు దాన్ని టేబుల్ ఐటెమ్‌గా కేబినెట్ ముందుకు తీసుకురావడం, ఎలాంటి చర్చకు తావులేకుండానే ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయినా కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి స్పందన లేకుండా వారం గడిచాక నోరు విప్పారు. మరో వారంలో: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈనెల 23వ తేదీతో ముగియనుంది. ఆరోజుతో అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయ సేకరణ పూర్తిచేసి తిరిగి రాష్ట్రపతికి పంపాలి. ఈతరుణంలో సమైక్యం పేరిట కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రజల్లోకి పంపే సన్నాహాల వెనుక రాజకీయంగా బలమైన కారణాలే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమైక్య నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి దూసుకుపోతుండడంతో అటు కాంగ్రెస్, టీడీపీ రెండూ కూడబలుక్కొని ఈ కొత్త నాటకానికి తెర తీసినట్టు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని ఇప్పటివరకు దేశంలోని అన్ని కాంగ్రెసేతర జాతీయ పార్టీల నేతలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలసి విన్నవించారు. ఈ దశలోనే సీఎం కిరణ్‌తో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టించేందుకు అసెంబ్లీ వేదికగా సమైక్య ప్రచారం వినిపించేలా కార్యాచరణ రూపొందినట్టు తెలుస్తోంది. ఈ కొత్త పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించిన సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ చూస్తున్నట్లు చెబుతున్నారు. వివిధ బ్యాంకులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్ల మేర అక్రమాలు చేసినట్లు ఆరోపణలున్నప్పటికీ ఆ ఎంపీపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వెనుక రాష్ట్ర విభజనకు ఆయన అందిస్తున్న సహకారమే కారణమని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తన ఆదేశాలను తూ.చ తప్పక పాటిస్తున్నందునే చివరి నిముషం వరకు సీఎం సీట్లో కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్టానం కొనసాగనిస్తోందని, అలా కాకపోతే ఈపాటికే ఆయన్ను మార్చేసేవారేనని పేర్కొంటున్నారు. తనకు వ్యతిరేకంగా ఉంటే ఢిల్లీలో విమానం ఎక్కి హైదరాబాద్‌లో దిగేలోపే సీఎంలను మార్చే సంస్కృతి ఉన్న కాంగ్రెస్ కిరణ్ పట్ల ఇంత ఉదారతతో ఉందంటే అందుకు కారణం ఆయన విభజనకు పూర్తి సహకారం అందించడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సమైక్యం కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను ఎలా కట్టడి చేయాలో అంతుబట్టక కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా కొత్త ముసుగులో త్వరలోనే తెరమీదకు రావడానికి సర్వం సిద్ధమైంది. సీమాంధ్రులను మభ్యపెట్టి విభజనపై అధిష్టానానికి ఆది నుంచి కిరణ్ పూర్తి సహకారాన్ని అందించడమే కాకుండా, సమైక్య ముసుగులో సీవూంధ్ర పార్టీ ఎమ్మెల్యేలను భ్రమల్లో ఉంచడం ద్వారా ఎక్కడా అడ్డంకులు లేకుండా చేయడం తెలిసిందే. బిల్లును అడ్డుకుంటానంటూ చెబుతూనే, దానిపై చర్చను చివరి దశ దాకా తీసుకెళ్లడమే గాక, సహచర ఎమ్మెల్యేల నుంచి కూడా అందుకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన నైజం అర్థమయ్యాక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా కంగుతిన్నారు. కిరణ్ సమైక్య నినాదం వెనుక రాష్ట్ర విభజనకు సహకారం, కొత్త పార్టీ వ్యూహం దాగున్నాయని అర్థమై, తాము పూర్తిగా మోసపోయామంటూ ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర సమైక్యతకు కిరణ్ అడుగడుగునా తూట్లు పొడిచిన వైనాన్ని వారు వరుసగా గుర్తుచేసుకుంటున్నారు. విభజనపై ప్రతి అడుగూ కిరణ్‌కు ముందే తెలుసునని, అయినా అధిష్టానంతో కుమ్మక్కై వ్యవహారాన్ని ముందుకు నడిపించారని నిర్ధారణకొస్తున్నారు. గత ఏడాది జనవరిలో జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీలోనే అధిష్టానం తెలంగాణపై నిర్ణయుం తీసుకొని కిరణ్‌కు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు తెలిపింది. ఈ విషయాన్ని బొత్సే పలుమార్లు స్పష్టంగా ప్రకటించారు. ఆ సమావేశంలో అధిష్టానం ఆదేశాలకు కిర ణ్ తలూపి, పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన రంగాన్ని సిద్ధంచేశారు. తెలంగాణపై నిర్ణయం అధికారికంగా ప్రకటించే ముందు అధిష్టానం పార్టీ కోర్‌కమిటీ సవూవేశానికి సీఎంను పిలిచి చర్చించింది. ఈ సమావేశంలో తాను రూపొందించిన రోడ్ మ్యాప్‌ను అధిష్టానానికి కిరణ్ అందించారు. అప్పుడే అధిష్టానం కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి తన ముందున్న రోడ్‌వ్యూప్‌ను కిరణ్‌కు ఇచ్చి, దాని అవులు బాధ్యతను ఆయునపైనే పెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.. అందుకే విభజనకు సంబంధించి కేంద్రం వేసే ప్రతి అడుగు కిరణ్‌కు ముందే తెలుసునని పేర్కొంటున్నాయి. అడుగడుగునా బాబు సహకారం మరోపక్క రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. సభా నాయుకుడిగా సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడు ఇద్దరూ పరస్పర సహకారంతో రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయుం వెలువడిన వెంటనే చంద్రబాబు దాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటన చేయడంతోపాటు సీమాంధ్రలో కొత్త రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని కూడా కోరారు. ఆ తరువాత రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకొనే ప్రతి కీలక దశకు ముందు ఆయన ఢిల్లీలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కాంగ్రెస్ పెద్దలకు సహకారం అందించేలా వ్యవహరించారు. కేబినెట్ ఆమోదం ముందురోజు ఆయన ఢిల్లీలోనే పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఢిల్లీలో సమన్యాయం పేరిట చంద్రబాబు దీక్షకు దిగిన రోజునే కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఆ తరువాత మరో సందర్భంలో బాబు ఢిల్లీయూత్ర సమయంలోనే మంతత్రుల బృందం తొలి భేటీ జరిగింది. అటు కిరణ్, ఇటు చంద్రబాబులు ఇద్దరూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను అనుసరించి విభజన ను ముందుకు నడిపించుకుంటూ తీసుకువచ్చారు. తనపై ఎమ్మార్, ఐఎంజీ భారత్ భూముల కుంభకోణంతోపాటు మద్యం కేసులు ఇతరత్రా అనేక అవినీతిపై విచారణ జరిపించకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రతి అడుగులోనూ కాంగ్రెస్‌కు సహకరించారన్న విషయంలో అనేక విమర్శలొచ్చాయి. చిత్తశుద్ధే ఉండి ఉంటే... విభజనను వ్యతిరేకించే వ్యక్తే అయ్యుంటే కేబినెట్ నిర్ణయుం తరువాతైనా కిరణ్ వెంటనే రాజీనామా చేసి ఉండేవారు. తద్వారా సంక్షోభం ఏర్పడి కేంద్రం విభజన నిర్ణయం నుంచి వెనకడుగు వేసేదని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. కానీ ఆయన అలా చేయకపోగా, సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డా వారి ఆవేశంపై నీళ్లు చల్లారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాల్సి ఉంటుంది కనుక రాజీనామాలు వద్దంటూ నిలువరించారు. మరోపక్క సీమాంధ్రలో రెండు నెలలకుపైగా ఉధృతంగా సాగిన ఉద్యోగుల సమ్మెను సైతం భయుపెట్టి, బెదిరించి అర్ధంతరంగా ఉపసంహరించేలా చేసి విభజన ప్రక్రియకు ఆటంకం లేకుండా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడేలా చేశారు. ఇక రాష్ట్ర విభజనపై కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావలసిన సమాచారాన్ని మొత్తం ఆగమేఘాలపై అందేలా కిరణ్ సహకరించారు. రాష్ట్ర విభజనపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించే అధికారం తమకు లేదని, కేవలం విభజన సమస్యల పరిష్కారం మాత్రమే తమ బాధ్యత అని మంత్రుల బృందం ప్రకటించగా అదే బృందం ముందుకు వెళ్లి సీఎం తన అభిప్రాయాలు వినిపించారు. సమైక్యమన్న వాదనపైనే సీఎంకు చిత్తశుద్ధి ఉండి ఉంటే జీఓఎం ముందుకు వెళ్లే వారే కాదు. రాష్ట్రపతి నుంచి విభజన బిల్లు వచ్చే సమయానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేలా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తేదీలను ఖరారు చేయించారు. రాష్ట్ర విభజన బిల్లు రాకముందే సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పదేపదే విజ్ఞప్తి చేసినా కిరణ్ వినిపించుకోలేదు. సమైక్య తీర్మానం చేస్తే రేపటి రోజున పార్లమెంట్లో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ రకంగా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నిస్తూ అడ్డుకునే ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో సమైక్య తీర్మానం ప్రతిపాదనపైన కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూవచ్చారు. ఇలావుండగా, బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ హైదరాబాద్‌కు వచ్చి అది సభకు వెళ్లేలా ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. బిల్లు తన చేతికి వచ్చిన 17 గంటల్లోనే సీఎం ఆగమేఘాలపై అసెంబ్లీకి పంపారు. మరోవైపు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టించడం, చర్చను చేపట్టించడం అంతా నాటకీయు రీతిలో ముందుకు నడిపించారు. చర్చ ప్రారంభమైందా లేదా అన్న దానిపై మూడు రోజుల పాటు రసవత్తర డ్రామాను నడిపించి చివరకు ప్రారంభమైందని తేల్చేశారు. -
కిరణ్ కాంగ్రెస్‌లోనే ఉంటారు: వాయలార్
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని కేంద్రమంత్రి వాయలార్ రవి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనేది మీడియా ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ నష్టపోతుందనేది ముఖ్యమంత్రి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని వాయలార్ రవి అన్నారు. కాగా కిరణ్ సొంత పార్టీ పెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన తాజా వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ అధిష్టానం, సొంత నేతలతోనే ‘వ్యతిరేక రాగం’ విన్పించి, కొత్త పార్టీ పెట్టించి, ఆ ముసుగులో ఎన్నో కొన్ని ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని వ్యూహరచన చేసినట్టు పీసీసీ వర్గాల్లోనే చాలాకాలంగా విన్పిస్తుండటం తెలిసిందే. తాజా పరిణామాలు, సీఎం చర్యలన్నీ అందులో భాగంగానే కన్పిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
కిరణ్ పార్టీలో చేరతా: మంత్రి శత్రుచర్ల
హైదరాబాద్: కాంగ్రెస్‌లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలో చేరలేనని చెప్పారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే అందులో చేరుతానని లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాని వెల్లడించారు. ఇవేమీ కాకుంటే రాజకీయాలనుంచి వైదొలుగుతానని శత్రుచర్ల అన్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని భావిస్తున్నారు. దీంతో మంత్రులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. -
కిరణ్ పార్టీలోకి సీమాంధ్ర రెబల్ ఎంపీలు?
హైదరాబాద్: అధిష్టానంపై తిరుగుబాబు బావుటా ఎగురవేసిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టనున్న పార్టీలో చేరనున్నారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్త ప్రచురించింది. ఈ విషయం తెలిసే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్‌కు వస్తున్నారని వెల్లడించింది. కిరణ్ కొత్త పార్టీకి సంబంధించిన సమాచారంపై సింగ్ ఆరా తీస్తున్నట్టు తెలిపింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చి కలకలం రేపారు. అవిశ్వాస తీర్మానంపై ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, జీవీ హర్ష కుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశిరావు సంతకాలు చేశారు. వీరంతా సీఎం కిరణ్ పెట్టే చేరేందుకు ఇదంతా చేస్తున్నారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. వీరంతా కిరణ్ కొత్త పార్టీలో వ్యవస్థాపక సభ్యులుగా ఉంటారని ప్రచారం జరుగుతోంది. సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ కూడా కిరణ్ పెట్టబోయే పార్టీలో చేరతారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రానికి వస్తున్న దిగ్విజయ్ సింగ్ పార్టీలో నెలకొన్న కుమ్మలాటలను ఏవిధంగా దారికి తెస్తారో అని చర్చించుకుంటున్నారు. -
కొత్తపార్టీ గురించి సీఎం ప్రస్తావించలేదు: శైలజానాథ్
హైదరాబాద్: కొత్త పార్టీ గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమతో ప్రస్తావించలేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ప్రజలు సంక్షేమంగా ఉంటారని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. విభజనను అడ్డుకునేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల ద్వారా విభజనను అడ్డుకుంటామన్నారు. ఎన్నికల ముందు పొలిటికల్ సర్వేలు సహజమేనని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వేలే ప్రాతిపదికగా చెప్పలేమన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని శైలజానాథ్ తెలిపారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో... విభజనకు పూర్తిగా సహకరించి, అంతా అయిపోయాక, చివరికి ‘సమైక్య సింహం’ ముసుగులో కొత్త పార్టీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే నేతృత్వం వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి పార్టీ నేతలందరితో ఆయన ఇప్పటికే అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నారు. కొత్త పార్టీకి అవసరమైన ప్రచార సామగ్రిని కూడా సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమైక్యాంధ్ర సింహం పేరుతో ముఖ్యమంత్రి తన బొమ్మతో పలు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయిస్తున్నారు. అయితే విభజన ప్రక్రియకు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆటంకాలూ లేకుండా మొత్తం వ్యవహారం నడిపించిన తర్వాతే సమైక్యాంధ్ర ఎజెండాగా కొత్త పార్టీ తెరమీదకొచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.