కిరణ్ కొత్త పార్టీ
* ఎట్టకేలకు ప్రకటించిన మాజీ సీఎం
* 12న రాజమండ్రి సభలో పార్టీ పేరు, విధానాల ప్రకటన
* తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యం
* కిరణ్ వెంట నలుగురు కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు, ఓ మాజీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న రాజమండ్రి బహిరంగ సభలో కొత్తపార్టీ పేరు, విధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే పార్టీ పెడుతున్నామని, పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తన ప్రైవేటు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కొత్త పార్టీ గురించి ప్రకటన చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్కృత ఎంపీల్లో కేవలం నలుగురు (లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్), మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి మాత్రమే ఉన్నారు. కిరణ్ చెప్పిన మాటలు నమ్మి సొంతపార్టీని వీడి ఆయన వెంట నడిచిన నాయకులు తమ పరిస్థితి ఎటూ కాకుండాపోతోందని ఒత్తిడిచేయడంతో ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆయనేమన్నారంటే...
* రాష్ట్ర విభజన ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీలు దెబ్బతీశాయి. బిల్లు రూపొందించిన తీరు, పార్లమెంటులో అప్రజాస్వామికంగా ఆమోదించిన విధానం సిగ్గుచేటు.
* అధికార దాహంతోనే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయి. ఇద్దరూ విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. బాబు, జగన్‌లకు సీఎం పదవిలోకి ఏదోవిధంగా రావాలన్నదొక్కటే లక్ష్యం.
* పురుడుపోసి తల్లిని చంపేశారని మోడీ చెబుతున్నారు. నలుగురు ఎంపీలు పోడియంలోకి వెళ్తే హృద యం గాయపడింద ని ప్రధాని అంటున్నారు. కానీ వీరెవ్వరూ తెలుగు ప్రజల గుండెకు తగిలిన గాయం గురించి ఆలోచించలేదు.
* ప్రస్తుతం ఎన్నికల సంఘం కొత్తగా ‘నోటా’ (పైవారెవ్వరూ కాదు అన్న ఆప్షన్) పెడుతున్నందున రాష్ట్ర ప్రజలంతా ఆయా పార్టీలకు కాకుండా నోటాపై ఓటువేసే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి వారందరికీ విన్నవిస్తున్నాను. మీ ఆలోచనల మేరకు నడిచే, మీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు కొత్త పార్టీ పెడుతున్నాం. ‘నోటా’కు బదులుగా మాకు ఓటేయండి.
* రాజమండ్రి బహిరంగసభలో పార్టీపేరు, విధానాలు, అధ్యక్షుడితోపాటు అన్ని విషయాలూ చెబుతాం. సీమాంధ్రతోపాటు, తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తాం.
* నా జీవితం తెరచిన పుస్తకం. నాపై ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నాను. నేను చేసిన ప్రతి నిర్ణయం చట్టం, నిబంధనల ప్రకారమే జరిగింది. గవర్నర్‌కే కాదు ఎక్కడైనా ఫిర్యాదులు ఇచ్చుకోనివ్వండి. నన్నెవరూ ఏమీ చేయలేరు.
* సీఎం నిర్ణయాలు తిరగదోడేందుకు గవర్నర్ ఎవరు? వచ్చే ప్రభుత్వాలు తిరగదోడొచ్చేమో కానీ గవర్నర్ ఎవరు? తిరగదోడితే మాత్రం ఏమవుతుంది? ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మంచిది.
* రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా. ఏమవుతుందో చూడాలి. మాకు అన్ని పార్టీలూ ప్రధాన పోటీదారులే.
* ఒకప్పుడు వేర్వేరుగా ఉన్న ఉభయ జర్మనీ దేశాలు గోడలు పగులకొట్టి మరీ ఏకంకాలేదా? ఇక్కడ అలా గోడలు కూడా లేవు కదా?