కిరణ్ పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర'
హైదరాబాద్: తాను పెట్టబోయే పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర' అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. తెలుగు ప్రజలను కలుపుకుని పోయేలా పార్టీ ఉంటుందని అన్నారు. తెలుగు జాతికి మేలు చేయడం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు.ఆత్మగౌరవంతో ఓటు వేయాలనుకునే వారి కోసం పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం పనిచేసిన వారందరినీ పార్టీలో చేర్చకుంటామన్నారు.
పిరికితనమున్న చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు అవమానకరమన్నారు. విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబేనని అన్నారు. విభజన ద్వారా తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది చంద్రబాబే అన్నారు. తెలుగువారికి కాంగ్రెస్, బీజేపీ తీవ్ర అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు. లాభనష్టాలు ఆలోచించకుండా విభజన చేశారని విమర్శించారు. తెలుగు జాతికి అన్యాయం చేసిన తర్వాత కాంగ్రెస్లో కొనసాగకూడదన్న ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు. తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు.