కాంగ్రెస్ ఎంపిల అవిశ్వాసం ఉపసంహరణ
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ను ఉపసంహరించుకున్నారు. తాము వ్యూహాత్మకంగానే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి చెప్పారు. రోజుకు ఒక్కొక్కరి చొప్పున అవిశ్వాస నోటీస్ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించిన విషయం తెలిసిందే. ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎ.సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్లు ఆ నోటీస్పై సంతకం చేశారు.
సీమాంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్‌కు మొత్తం 19 మంది లోక్‌సభ సభ్యులు ఉండగా, వారిలో ఆరుగురు మాత్రమే నోటీసుపై సంతకాలు చేశారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు సహా మిగతా లోక్‌సభ సభ్యులు ‘అవిశ్వాసం’పై స్పందించలేదు.
అవిశ్వాసం కోసం అని రాజీనామాలు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఏకంగా అవిశ్వాసం కూడా ఉపసంహరించుకున్నారు. ఈ రోజు తమకు తగిన సంఖ్యాబలం లేదని, అందువల్ల అవిశ్వాసం ఉపసంహరించుకున్నట్లు లగడపాటి చెప్పారు. రోజుకు ఒక్కొక్కరం అవిశ్వాస నోటీసు ఇస్తామన్నారు.