సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారంటూ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రకటనపై రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించే.. రెండు నియోజకవర్గాల్లో ఫలానా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ ఆయన ప్రకటిం చారని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయని, కానీ ఆ అంచనాలే నిజం కావాలని లేదని వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా రోజుకు రెండు నియోజకవర్గాల ఫలితాలను వెల్లడిస్తానంటూ లగడపాటి చెప్పడం బాధ్యత లేకుండా వ్యవహరించడమేనని మండిపడుతున్నాయి. సర్వే అంచనాలు ప్రకటించడం తప్పు కాదని, వాటిని ప్రకటించడానికి అవసరమైన అన్ని పద్ధతులు, ఆధారాలను ప్రజల ముందుంచాల్సిన అవసరాన్ని లగడపాటి విస్మరించారని సర్వే పండితులు అంటున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలకదశకు చేరుకున్న తరుణంలో అకస్మాత్తుగా లగడపాటి తిరుపతిలో ప్రత్యక్షం కావడం.. శాసనసభ ఎన్నికల్లో ఎక్కువమంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పడం వెనుక ఏం జరిగిందనే అంశంపై ‘సాక్షి’ కొంత సమాచారం సేకరించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి వెళ్లడానికి ముందే తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుతో లగడపాటి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరు కాంగ్రెస్ నేతలతో పాటు ఎల్లో మీడియా తోక పత్రిక అధినేత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమికి, టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్లాన్ వేసినట్టు స్పష్టమవుతోంది. అధికార టీఆర్‌ఎస్ దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు.
సర్వే అంచనా వేస్తుందే కానీ ఫలితాలు ప్రకటించదు...
ఎన్నికల సమయంలో ప్రచార సాధనాలు సర్వే చేయడం సాధారణమైన విషయం. అది తప్పు కూడా కాదు. కానీ, సర్వే అంచనాలను ప్రజల ముందుంచాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి. ఏయే తేదీల్లో సర్వే చేశారు, ఎంత మంది సర్వేలో పాల్గొన్నారు. శాంపిల్ సైజు ఎంత, ఎన్ని నియోజకవర్గాల్లో సర్వే చేశారు, అన్నింటికీ మించి ఏ సంస్థ సర్వే చేసిందన్న వివరాలు తప్పనిసరిగా ప్రజలకు వివరించాలి. అలా కాకుండా ఏ రాజకీయ పార్టీ కోసమో కొన్ని వివరాలు మాత్రమే వెల్లడించడం కచ్చితంగా తప్పే అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సర్వేలు అంచనా మాత్రమే వేస్తాయని, వాటిని తుది ఫలితాలుగా ప్రకటించడమంటేనే ఏదో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమేనని ఓ రాజకీయ విశ్లేషకుడు స్పష్టంచేశారు. ‘సర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయి. పోలింగ్ ముగిసే వరకు ఆ ఓటర్ల అభిప్రాయాలు అలాగే ఉంటాయనుకోవడానికి లేదు. ఓటేసేవారు ఇండిపెండెంట్‌కు వేస్తామంటే ఇక వారిలో మార్పు ఉండదని లగడపాటి చెప్పడం కూడా పొరపాటు. పైగా అంచనాలు ఇలా ఉన్నాయని చెప్పడం వేరు.. ఫలానా అభ్యర్థులు గెలుస్తారని ప్రకటించడం వేరు. కచ్చితంగా దీని వెనుక రాజకీయ ప్రయోజనం దాగుంది’ అని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. లగడపాటి సర్వే చేసి ఉంటే వాటి పూర్తి అంచనాలను వెల్లడించకుండా రోజుకు రెండు నియోజకవర్గాలు ప్రకటిస్తాననడం అనుమానించదగ్గ విషయమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు వ్యాఖ్యానించారు. ‘సర్వే చేసినప్పుడు ఏ పార్టీ గెలుస్తుందన్న అంచనాలు వెలువరించవచ్చు. దానికి సంబంధించిన అన్ని పూర్వాపరాలు కూడా ప్రజలకు తెలియజేయాలి. అప్పుడే దానికి విశ్వసనీయత ఉంటుంది. లగడపాటికి ఈ విషయాలు తెలియదని నేను అనుకోవడం లేదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆలా చెప్పారో తెలియదు’ అని కృష్ణారావు పేర్కొన్నారు.
కాలజ్ఞానం చెప్పే బ్రహ్మంగారిలా ఇవేమీ ప్రకటనలు?
సర్వే చేసే ఏ సంస్థ లేదా వ్యక్తి అయినా సరే దాని పూర్తి వివరాలు తెలియజేయాలి. కానీ, లగడపాటి మాత్రంబ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టుగా రోజుకు రెండు స్థానాల్లో ఎవరు గెలుస్తారో చెబుతానంటూ సంచలన ప్రకటనే చేశారు. సర్వే వివరాలు వెల్లడించకుండా ఎవరు గెలుస్తారో చెప్పడం చిలుక జోస్యమే అవుతుందని సర్వే నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. లగడపాటి సర్వే చేసి ఉంటే మొత్తం అంచనాలు ప్రకటించాలని.. ఆ సర్వే ఎప్పుడు చేశారో, శాంపిల్ సైజు ఎంత వంటి వివరాలు ఉన్నప్పుడే దానికి పారదర్శకత ఉంటుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ రీసెర్స్ అసోసియేట్ ఎస్.బాల నరసింహారెడ్డి అన్నారు. ‘నాకు తెలిసి ఈ దశలో ఓపీనియన్ పోల్ ఫలితాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా.. అన్ని వివరాలు ప్రజల ముందుంచాలి. అలా చేయకుంటే సర్వే చేశారో లేదో ఎలా తెలుస్తుంది’ అని ఆయన ప్రశ్నించారు. అంచనాలు, ఫలితాలకు తేడా లేకుండా మాట్లాడటం కూడా తప్పేనని, అది తప్పుడు సంకేతాలకు కారణమవుతుందని మరో సర్వే సంస్థ నిపుణుడు పేర్కొన్నారు. ‘గతంతో లగడపాటి సర్వే చేయించిన టీమ్‌లో నేను పని చేశాను. కానీ, మాదంతా ఎగ్జిట్ పోల్ లేదా ఎన్నికల తర్వాత తీసుకునే పోస్ట్ పోల్ సర్వేపై ఆధారపడి అంచనాలు ఉండేవి. ఇప్పుడు సర్వే చేశారో లేదో నాకైతే తెలియదు’ అని ఆ నిపుణుడు చెప్పారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఫలితాల ప్రకటన?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 శాతం ఎక్కువగా ప్రజల మద్దతు పొందుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన వైఫల్యాలు బీజేపీపై నెట్టి ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలిసి కాంగ్రెస్‌తో పొత్తు కోసం వెంపర్లాడారు. ఇప్పటికే పలుమార్లు అమరావతిలో చంద్రబాబుతో సమావేశమైన లగడపాటి కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే కొంచెమైనా కలిసి వస్తుందని చెప్పడంతో పాటు రెండు పార్టీల మధ్య రాయబారం నెరిపారు. ఈ సంగతి ఏపీ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నానని లగడపాటి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ కూటమి విజయవంతమైతే అదే పార్టీలో చేరి టీడీపీ మద్దతుతో మల్కాజ్‌గిరి లేదా ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి వెల్లడిస్తున్న ఎన్నికల ఫలితాల ప్రకటన వెనుక కచ్చితంగా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నది రాజకీయవర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.
1994, 2004 ఎన్నికల్లో స్వతంత్రుల గెలుపుపై కథనం...
శాసనసభ ఎన్నికల్లో అత్యధికులు ఇండిపెండెంట్లు గెలిస్తే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుందని, దానికి గతంలో రెండు ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలే నిదర్శనమంటూ ఓ ఎల్లో పత్రిక లడగపాటి ప్రకటనకు తోడుగా పెద్ద కథనాన్నే ప్రచురించింది. అంటే లగడపాటి ఈ ప్రకటన చేయడానికి ముందే దీనిపై కసరత్తు జరిగినట్లు అర్థమవుతోంది. దానికి అనుగుణంగానే ఈ ఎన్నికల్లో 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలువబోతున్నారంటూ లగడపాటి తిరుపతిలో ప్రకటన చేశారు. పైగా గెలుస్తారని ప్రకటించిన ఇద్దరు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు కావడం గమనార్హం. గతంలో మాదిరి ఈ సారి కూడా ప్రభుత్వం మారబోతోందంటూ చెప్పడం ద్వారా తటస్థ ఓటర్లను ప్రభావితం చేయడమే చిలుక జోస్యం పరమార్థమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. ‘ఎన్నికల్లో అపవిత్ర పొత్తులకు, అనైతిక ఎత్తులకు చంద్రబాబు పెట్టింది పేరు. ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలని తహతహలాడుతున్న చంద్రబాబు, ఆయన వందిమాగదులు ఎన్ని మాయపాచికలు వేసినా ఫలితం ఉండదు’ అని రాజేశ్వరరెడ్డి స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment