కిరణ్ కాంగ్రెస్లోనే ఉంటారు: వాయలార్
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని కేంద్రమంత్రి వాయలార్ రవి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనేది మీడియా ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ నష్టపోతుందనేది ముఖ్యమంత్రి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని వాయలార్ రవి అన్నారు.
కాగా కిరణ్ సొంత పార్టీ పెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన తాజా వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ అధిష్టానం, సొంత నేతలతోనే ‘వ్యతిరేక రాగం’ విన్పించి, కొత్త పార్టీ పెట్టించి, ఆ ముసుగులో ఎన్నో కొన్ని ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని వ్యూహరచన చేసినట్టు పీసీసీ వర్గాల్లోనే చాలాకాలంగా విన్పిస్తుండటం తెలిసిందే. తాజా పరిణామాలు, సీఎం చర్యలన్నీ అందులో భాగంగానే కన్పిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.