'మీరు వెళితే వెళ్లండి...మేము రాము'
అమలాపురం : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ యత్నాలకు ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఆ పార్టీపై ఆశలు పెట్టుకుని సొంత పార్టీని ధిక్కరించి బహిష్కరణకు గురైన నేతలకు దిక్కు తోచటం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీని నమ్ముకుని సొంత పార్టీని ధిక్కరించిన ఎంపీ హర్షకుమార్ రెంటికీ చెడ్డ రేవడిలా మారుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగి రోజులు గడుస్తున్న కొద్దీ కిరణ్ పార్టీ పెడతారనే నమ్మకం సన్నగిల్లుతుండగా, తన వెంట వస్తారని భావించిన కాంగ్రెస్ క్యాడర్ మొండిచేయి చూపడంతో హర్షకుమార్ తలపట్టుకుంటున్నారు. 'మీరు వెళితే వెళ్లండి...మేము రాము' అని వారు తెగేసి చెప్పడంతో హర్షకుమార్కు ఎటూ పాలుపోవడం లేదు. తాజాగా కిరణ్ పార్టీలోకి కాంగ్రెస్ వాదులను రప్పించేందుకు హర్ష తనయుడు సుందర్ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి.
బొడసకుర్రు వంతెన ప్రారంభోత్సవానికి ఆహ్వానించే పేరుతో సుందర్ గత రెండు రోజులుగా రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి కిరణ్ పార్టీ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రభావం ఉంటుందని ఆరా తీశారు. పనిలోపనిగా మీరు కూడా కిరణ్ పార్టీలోకి రావాల్సిందిగా కోరారు.
'కిరణ్ పార్టీకి ప్రజల్లో అసలు ఆదరణ ఉండదు. 'మీరు వెళితే వెళ్లండి... మేము మాత్రం రాము' అని తెగేసి చెప్పటంతో సుందర్ విస్తుపోయినట్లు సమాచారం. తండ్రి కోసం తనయుడి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో భవిష్యత్ కార్యాచరణపై మల్లాగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.