సీమాంధ్ర ఎంపీలు (ఫైల్ ఫోటో)
హైదరాబాద్: అధిష్టానంపై తిరుగుబాబు బావుటా ఎగురవేసిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టనున్న పార్టీలో చేరనున్నారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్త ప్రచురించింది. ఈ విషయం తెలిసే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్కు వస్తున్నారని వెల్లడించింది. కిరణ్ కొత్త పార్టీకి సంబంధించిన సమాచారంపై సింగ్ ఆరా తీస్తున్నట్టు తెలిపింది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చి కలకలం రేపారు. అవిశ్వాస తీర్మానంపై ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, జీవీ హర్ష కుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశిరావు సంతకాలు చేశారు. వీరంతా సీఎం కిరణ్ పెట్టే చేరేందుకు ఇదంతా చేస్తున్నారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. వీరంతా కిరణ్ కొత్త పార్టీలో వ్యవస్థాపక సభ్యులుగా ఉంటారని ప్రచారం జరుగుతోంది.
సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ కూడా కిరణ్ పెట్టబోయే పార్టీలో చేరతారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రానికి వస్తున్న దిగ్విజయ్ సింగ్ పార్టీలో నెలకొన్న కుమ్మలాటలను ఏవిధంగా దారికి తెస్తారో అని చర్చించుకుంటున్నారు.