సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్తుండడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు భవిష్యత్ కార్యాచరణపై శనివారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో ఈ భేటీ జరగనుంది. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి నిర్వహించాలని మొదట భావించినా చివరకు ఎంపీలు, కేంద్రమంత్రులకు పరిమితం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, సీమాంధ్రలో ఉద్యమం, రాజీనామాలు తదితర అంశాలపై భేటీలో చర్చ జరగనుంది. సమావేశ నిర్వహణ బాధ్యత కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం తదితర మంత్రులు తీసుకున్నారు. అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై వీరంతా తర్జనభర్జన పడుతున్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు సమైక్య వాదన గట్టిగా వినిపించినా.. సీడబ్ల్యూసీ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేది లేదని ఢిల్లీ పెద్దలు ప్రకటిస్తున్నారు.
ఎంపీలు, కేంద్రమంత్రులు నిర్లిప్తంగా ఉన్నందునే విభజనపై కేంద్రం ముందుకెళుతోందని ఆగ్రహంతో ఉన్న సమైక్యవాదులు వారు రాజీనామా చేస్తే విభజన ప్రక్రియ నిలిచిపోతుందంటూ.. వారి రాజీనామాలకు పట్టుపడుతున్నారు. ఇప్పటికే ఎంపీలు, కేంద్రమంత్రులను లక్ష్యంగా చేసుకుని ఇళ్ల ముట్టడి తదితర నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పార్లమెంటు సమావేశాల నెపంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ఢిల్లీలో గడిపారు. సమావేశాలు ముగియడం, ఎన్నికల సంవత్సరం కావడంతో వారు ప్రజల ముందుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. ఏపీఎన్జీవోలు సహ ఉద్యమకారుల నుంచి రాజీనామాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో ఆ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.
రాజీనామాలు చేసినంత మాత్రాన విభజన ఆగదని, అలాం టప్పుడు రాజీనామాలతో ఫలితమేముంటుందని ఎంపీలు, కేంద్రమంత్రులు ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చారు. మంత్రులేగాక ఎంపీల్లోనూ కొందరు రాజీనామాలపై విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ రాజీనామా చేయనని ముందే ప్రకటించారు. పనబాక లక్ష్మి రాజీనామాపై సందిగ్ధంలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎంపీల్లో రాయపాటి సాంబశివరావు కొందరి రాజీనామాలతో ఫలితం ఉండద ని, అందరూ చేస్తేనే విభజన ఆగుతుందని, అలా అయితేనే తాను రాజీనామా చేస్తానని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. అందరూ రాజీనామాలకు అంగీకరిస్తేనే తాను భేటీకి హాజరవుతానని, లేదంటే వెళ్లబోనన్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విభజన వైపే మొగ్గు చూపుతున్నందున ఆయన భార్య, ఎంపీ బొత్స ఝాన్సీ రాజీనామాకు విముఖంగానే ఉంటారని అంటున్నారు. ఎంపీ చింతా మోహన్‌దీ అదేదారి అని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ ముగ్గురూ భేటీకి హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కిశోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మి కూడా రాకపోవచ్చంటున్నారు.
రాజీనామాలపై తలోదారి!
Published Sat, Sep 14 2013 3:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement