ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాసం
న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు స్పీకర్ లోక్సభ మీరా కుమార్కు నోటీసు అందజేశారు. 190 నింబంధన కింద స్పీకర్ మీరా కుమార్కు నోటీయిచ్చారు. అవిశ్వాస తీర్మానంపై ఉండవల్లి అరుణ్ కమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, రాయపాటి సాంబశిరావు సంతకాలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన సీమాంధ్ర ఎంపీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని స్పీకర్కు స్వయంగా నోటీసు అందజేసినట్టు ఎంపీ సబ్బం హరి తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతించాల్సివుంటుందని తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఏం నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియదన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే పార్లమెంట్ సభ్యత్వం ఉండాలని ఆయన చెప్పారు. అందుకే ఇంతకుముందు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.
విభజన విషయంలో పార్టీగానీ, ప్రభుత్వం గానీ నైతికంగా వ్యవహరించలేదని విమర్శించారు. విభజనను అడ్డుకునేందుకు సీఎం తమకు అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్కు వచ్చి ఆమోదం పొందేంత వరకు అడ్డుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తుంటామన్నారు. విభజనకు వ్యతిరేకంగా అవగింజ అంత అవకాశం దొరికినా ముందుకు వెళతామన్నారు. సమైక్యాంధ్రే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. తమను అనుమానించొద్దని సబ్బం హరి కోరారు.