అవిశ్వాస తీర్మానానికి సమాజ్ వాదీ మద్దతు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా యూపీఏ సర్కారుపై అవిశ్వాసానికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ మద్దతు ప్రకటించగా మరో కీలక పార్టీ అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. గత పదేళ్లుగా యూపీఏను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న సమాజ్‌వాదీ పార్టీ.. అవిశ్వాసానికి మద్దతు తెలిపింది. ఇందుకు సంబంధించి రాజ్యసభలో ఇవాళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మరోసారి ఉద్యమం రగులుతున్న వేళ కేంద్రం లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ కేంద్రం తమను సంప్రదించకుండా బిల్లును ప్రవేశపెట్టడంపై భగ్గుమంది. యూపీఏ తీరుపై తీవ్ర అసంతృప్తికి గురైన సమాజ్‌వాదీ కేంద్రంపై ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ యూపీఏపై అవిశ్వాసానికి మద్దతు ప్రకటించింది. లోక్‌సభలో సమాజ్ వాదీ పార్టీకి 21 మంది ఎంపీల బలముంది. మరోవైపు... రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.