కొత్తపార్టీ గురించి సీఎం ప్రస్తావించలేదు: శైలజానాథ్
హైదరాబాద్: కొత్త పార్టీ గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమతో ప్రస్తావించలేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ప్రజలు సంక్షేమంగా ఉంటారని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. విభజనను అడ్డుకునేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల ద్వారా విభజనను అడ్డుకుంటామన్నారు.
ఎన్నికల ముందు పొలిటికల్ సర్వేలు సహజమేనని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వేలే ప్రాతిపదికగా చెప్పలేమన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని శైలజానాథ్ తెలిపారు.
కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో... విభజనకు పూర్తిగా సహకరించి, అంతా అయిపోయాక, చివరికి ‘సమైక్య సింహం’ ముసుగులో కొత్త పార్టీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే నేతృత్వం వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి పార్టీ నేతలందరితో ఆయన ఇప్పటికే అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నారు. కొత్త పార్టీకి అవసరమైన ప్రచార సామగ్రిని కూడా సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సమైక్యాంధ్ర సింహం పేరుతో ముఖ్యమంత్రి తన బొమ్మతో పలు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయిస్తున్నారు. అయితే విభజన ప్రక్రియకు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆటంకాలూ లేకుండా మొత్తం వ్యవహారం నడిపించిన తర్వాతే సమైక్యాంధ్ర ఎజెండాగా కొత్త పార్టీ తెరమీదకొచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.