సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పెద్దలు తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పిదమేనని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలనిపిస్తోందన్నారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. విభజన ప్రక్రియ నిలిచిపోతుందని భావించినప్పుడల్లా... తెలంగాణ నోట్ సిద్ధమైందంటూ కేంద్ర పెద్దలు బాంబులు పేలుస్తూ ప్రజలను ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.
సీమాంధ్ర ప్రజలు నీళ్లు, అన్నం లేక చచ్చేటట్లున్నందున, ఆదుకోవాలని అడుగుతుంటే, రూ. రెండు లక్షల కోట్లతో హైదరాబాద్‌లోనే ఐటీ సెంటర్ అంటూ, కేంద్రం మరింత రెచ్చగొడుతోందన్నారు. ఇష్టమొచ్చినట్లు చేస్తాం... దిక్కున్నచోట చెప్పుకోవున్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు.