సాక్షి, అమరావతి : కాంగ్రెస్-టీడీపీ పొత్తు అంశంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత జేసీ మీడియాతో మాట్లాడారు. తాజా రాజకీయాలతో పాటూ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, టీడీపీ-కాంగ్రెస్ పొత్తు అంశాలపై తనదైన శైలిలో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, అందుకే కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతుందని జేసీ అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి తెలుగు దేశం పార్టీకి లేదని, కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే తప్పులేదని తెలిపారు. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారన్నారు. ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనన్నారు. బీజేపీని నాలుగేళ్లు నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తామంటోంది కాబట్టి వారిని నమ్మి చూస్తే తప్పేమీ లేదన్నారు. నమ్మినవాడు ఎప్పుడు చెడిపోడని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైన మాట్లాడుతూ.. ముస్లింలు దూరమవుతారనే ఆందోళనతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్‌కు పొత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. అయితే కేంద్రంలో అధికారం మారితేనే పోరాటలకు ఫలితం ఉంటుందని జేసీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment