హైదరాబాద్ : అసెంబ్లీ లాబీలో గురువారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జేసీ దివాకర్ రెడ్డిల మధ్య సంవాదం చోటుచేసుకుంది. రాజ్యసభకు పోటీ చేస్తానంటూ ఎమ్మెల్యేల సంతకాలు ఎందుకు తీసుకుంటున్నారని బొత్స... ఈ సందర్భంగా జేసీని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే చర్యలు వద్దని... వెళ్లాలనుకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని బొత్స సూచించారు. అంతేకానీ ఇటువంటి చర్యలు సరికాదని జేసీతో ..పీసీసీ చీఫ్ అన్నారు.
కాగా జేసీ దివాకర్‌రెడ్డి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను స్వయంగా పోటీ చేయలేకపోతే మరో అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రాజ్యసభ నామినేషన్ పత్రాలపై పది మంది ఎమ్మెల్యేల సంతకాలను కూడా సేకరించారు.
నిన్న అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో మాజీ పీఆర్పీ నేతలైన ఎమ్మెల్యేలతో జేసీ సమావేశమై, ఈ ప్రతిపాదన చేశారు. పీఆర్పీకి చెందిన ఎమ్మెల్యేలు ఎలమంచిలి రవి, వంగా గీత, పంతం గాంధీమోహన్, బండారు సత్యానందరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉగ్ర నర్సింహారెడ్డి, రాజా అశోక్‌బాబులతో పాటు మరో ఐదుగురు జేసీ తెచ్చిన నామినేషన్ పత్రంపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే.