వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం  | JC New Drama To Escape The Forgery Case | Sakshi
Sakshi News home page

మాకేం తెలీదప్పా..అంతా బ్రోకర్లే జేసినారు.. 

Published Thu, Jul 2 2020 8:02 AM | Last Updated on Thu, Jul 2 2020 8:08 AM

JC New Drama To Escape The Forgery Case - Sakshi

‘జేసీ’....తన బస్సులాగే రూట్‌ మార్చాడు. తుక్కు వాహనాల కొనుగోలులో నకిలీలు జేసి జైలులో ఉన్న తండ్రీ, తనయులు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలు కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఈ కేసులో తమకేం తెలియదని.. బ్రోకర్‌ ద్వారా వాహనాలు కొనుగోలు చేశామని బుకాయిస్తున్నారు. అయితే తప్పుడు వ్యవహారంలో వారిద్దరూ తప్పించుకోలేరని..తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తుక్కు వాహనాల కొనుగోలు కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలు కేసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని.. కేవలం బ్రోకర్‌ ద్వారా వాహనాలను కొనుగోలు చేశామని బుకాయిస్తున్నట్లు సమాచారం. మొత్తం 154 బీఎస్‌–3 వాహనాలను తప్పుడు రిజి్రస్టేషన్లతో బీఎస్‌–4 వాహనాలుగా రిజి్రస్టేషన్‌ చేయించడంతో పాటు పలువురికి విక్రయించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలతో పాటు మరో నలుగురిపై 27 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ సమయంలోనే జేసీ కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది.

స్క్రాబ్‌ వాహనాల కుంభకోణంలో తమకేమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తాము నమ్మిన బ్రోకర్లే ఈ వ్యవహారం నడిపారని కేసు నుంచి తప్పించుకునే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే నాగాలాండ్‌ కేంద్రంగా బీఎస్‌–3 వాహనాలను తప్పుడు సరి్టఫికెట్లతో బీఎస్‌–4గా మార్చడంతో పాటు ఏకంగా పోలీసు అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. అయితే, ఈ తప్పంతా తాము జేసీ ఆదేశాలతోనే చేసినట్లు ఇతర నిందితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తప్పించుకునే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఏ–1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్‌ రెడ్డి సతీమణి), ఏ–2గా జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఏ–3గా నాగేంద్ర, ఏ–4గా బాబయ్య, ఏ–5గా జేసీ విజయ (జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి), ఏ–6గా జేసీ అస్మిత్‌ రెడ్డి (జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు)పై అనంతపురం, తాడిపత్రి స్టేషన్లల్లో మొత్తం 27 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో వీరి పాత్రకు తగిన ఆధారాలతో పాటు సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని...బుకాయింపులతో కేసు నుంచి తప్పించునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. 

ఇదీ జరిగింది..! 
వాతావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 2017 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–3 వాహనాల రిజి్రస్టేషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీఎస్‌–3 వాహనాలను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బీఎస్‌–3 వాహనాలను...నాగాలాండ్‌లో జేసీ ట్రావెల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 157 రవాణా వాహనాలను స్క్రాప్‌ కింద విక్రయించేందుకు ముందుకు రాగా... వీటిని తక్కువ ధరకు దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ విధంగా కొనుగోలు చేసిన వాహనాలను బీఎస్‌–4గా పేర్కొంటూ నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్‌ఓసీ తీసుకుని దర్జాగా జిల్లాలో ఇష్టారాజ్యంగా తిప్పారు.

కొద్ది మందికి కూడా కొత్త బీఎస్‌–4 వాహనాల కంటే కొంచెం తక్కువ ధరకు విక్రయించారు. అయితే, వీటిపై రవాణాశాఖ ఉన్నతాధికారులకు కాస్తా అనుమానాలు, ఫిర్యాదులు రావడంతో నాగాలాండ్‌కు వెళ్లి విచారణ ప్రారంభించారు. తీగలాగితే డొంక కదలగా... అక్రమంగా తిరుగుతున్న ఈ వాహనాలను ఎక్కడికక్కడ పట్టుకుని సీజ్‌ చేశారు. ఈ క్రమంలోనే జేసీ మరో ఎత్తుగడ వేశారు. విలువైన సామానులను తీసేసి.. కేవలం ఛాసీస్‌ మాత్రమే ఉంచి వాహనాలు అప్పగిస్తున్నారు. మరోవైపు తమను మోసం చేసి వాహనాలను విక్రయించారని పలువురు తాడిపత్రిలో ధర్నా చేయడంతో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు కూడా పెట్టారు.  

పక్కాగా ఆధారాలు ! 
వాస్తవానికి ఈ విధంగా బీఎస్‌–3 వాహనాలను...బీఎస్‌–4 వాహనాలుగా పేర్కొంటూ తప్పుడు రిజి్రస్టేషన్‌ జరిగిన వాహనాలకు ఎన్‌ఓసీ ఇవ్వడం సాధ్యం కాదని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వాహనాలను తాము రిజి్రస్టేషన్‌ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని, అందువల్ల తాము ఈ పనిచేయలేమని తేలి్చచెప్పినట్లు సమాచారం. అయితే, నాగాలాండ్‌లో రిజి్రస్టేషన్‌ చేసిన తర్వాత ఆర్‌సీలో బీఎస్‌–4 వాహనాలు అని పేర్కొన్నారని.. మీకేమీ ఇబ్బంది ఉండదంటూ వివిధ రకాలుగా రవాణాశాఖ అధికారులకు ఆశపెట్టి, బెదిరించి ఎన్‌ఓసీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ఎన్‌ఓసీ ఇచ్చిన రవాణాశాఖ అధికారులది తప్పంటూ జేసీ బ్రదర్స్‌ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా తాము నేరుగా ఈ వాహనాలను కొనుగోలు చేయలేదని.. తప్పంతా బ్రోకర్లదేనని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మొత్తం వ్యవహారంలో వీరి పాత్ర స్పష్టంగా ఉండటంతో ఎన్ని నాటకాలు ఆడినా తప్పించుకునే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement