
దిక్కులు చూస్తున్న అసంపూర్తి జెట్టి
సాక్షి, గాజువాక: చేపల వేట సాగించడం కోసం జెట్టీ లేకపోవడంతో గంగవరం మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. గంగవరం పోర్టు ప్రహరీ నిర్మాణానికి గ్రామాన్ని ఆనుకొని తీరం ఉండేది. పోర్టు ప్రహరీ తరువాత వారికి జెట్టీ లేకుండా పోయింది. యారాడలో ప్రారంభించిన జెట్టీ నిర్మాణం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. తనను గెలిపిస్తే జెట్టీ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చినా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా మత్స్యకారులు ఉపాధి లేకుండా మిగిలిపోయారు.
ఉపాధి చూపించే వరకు జీవన భృతి కొనసాగించాల్సి ఉన్నప్పటికీ నిలిచిపోయింది. తాను జీవన భృతిని ఇప్పిస్తానని పల్లా ఇచ్చిన హామీ గొంగలి సామెతను తలపించింది. దీనిపై ఇటీవల కాలంలో జీవో వచ్చిందంటూ హడావుడి చేయడం తప్ప మత్స్యకారులకు మాత్రం ప్రయోజనం అందలేదు. తమ గ్రామ దేవత పెద్ద అమ్మోరుతల్లిపై ప్రమాణం చేసిన పల్లా శ్రీనివాసరావు గెలిచిన తరువాత తమను మోసం చేశాడని, ఈ సారి ఎన్నికల్లో తమ ఓట్లు అడిగితే తగిన విధంగా స్పందిస్తామంటూ గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment