
సాక్షి, గాజువాక: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తోన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ, జనసేనలు కుమ్మక్కు అయ్యాయి. పవన్ కల్యాణ్‌ను గెలిపించడానికి మరోసారి పచ్చ కుట్ర జరుగుతోంది. పవన్ కల్యాణ్‌ను గెలిపించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను బలి పశువు చేస్తున్నారంటూ పల్లా శ్రీనివాస రావు మదనపడిపోతున్నారు. గాజువాకలో ప్రచారానికి రాకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెలికలు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బాబు ప్రచారానికి రాకపోతే ఎలా అని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస రావు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న హర్షవర్ధన్‌తో కలిసి పల్లా శ్రీనివాస రావు, చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలిసింది. పవన్ కల్యాణ్ గెలుపు కోసమే చంద్రబాబు గాజువాక ప్రచారానికి రావడం లేదని పల్లా శ్రీనివాస రావు స్పందించినట్లుగా తెలిసింది. తనకు ఎవరు ప్రచారం చేయకపోయినా ఫర్వాలేదని, తన సొంత సైన్యంతోనే గెలుస్తా అంటూ బాబుపై అలిగి వెళ్లినట్లుగా సమాచారం అందింది. పల్లా శ్రీనివాస రావును చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంతో తెలుగు దేశం కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.