రామభద్రపురం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు వేసవి సెలవుల్లేవు. వీరందరినీ ఉన్నత శ్రేణి విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘జ్ఞానధార’ అనే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. ఇందులో భాగంగా మే ఒకటో తేదీ నుంచి కొత్తగా ఐదు, తొమ్మిది తరగతులకు చెందిన 44,061 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యాప్రమాణాలతో బోధన సాగించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు తెలుసుకొనేందుకు 2017 నవంబర్‌లో జాతీయ విద్యా పరిశోదన శిక్షణా సంస్థ (ఎన్‌సీఈఆర్టీ) నేషనల్ ఎచీవ్‌మెంట్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన అందడం లేదని నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో విద్యా సామర్థ్యం తక్కువగా ఉన్న 5,9వ తరగతి విద్యార్థులకు వేసవిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఎన్‌సీఈఆర్టీ, విద్యాశాఖ సంకల్పించాయి. వేసవి సెలవుల్లో వీరిని హాస్టళ్లలో ఉంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 2650 ఉండగా వాటిలో 5వ తరగతి 21,926 మంది, 9వ తరగతి 22,135 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఐదో తరగతి విద్యార్థులు సుమారు 45 నుంచి 50 శాతం.. 9వ తరగతి విద్యార్థులు 40 నుంచి 45 శాతం మంది చదువులో బాగా వెనుకబడి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో జరిగిన సమ్మెటివ్ ఎసెస్‌మెంట్(ఎస్‌ఏ–1) పరీక్షల్లో 5, 9 తరగతుల్లో కనీస అభ్యసనా సామర్థ్యాలు చేరుకోలేని విద్యార్థులను గుర్తించి వారికి మే ఒకటి నుంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తారు.
యోగాతో పాటు ఆహారం..
జ్ఞానధార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందజేయనున్నారు. అలాగే యోగా కూడా నేర్పిస్తారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు హోంవర్క్.. 4.15 గంటల నుంచి హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఉంటుంది. సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల వరకు లఘుచిత్రాల ప్రదర్శన.. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. డిజిటల్ తరగతులు, వారాంతపు ఎసెస్‌మెంట్‌పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌తో పాటు వేల్యుయేషన్ చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సఫలీకృతమవుతుందా..?
ఏప్రిల్‌లో పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులంతా వేసవి సరదాలో ఉంటారు. అలాంటి సమయంలో శిక్షణ తరగతులు విజయవంతమవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయులు ముందు చెప్పకపోవడం వల్లే విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నారని.. ఈ సారి కూడా బాగా చెబుతారనే నమ్మకం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులు మాత్రం ‘జ్ఞానధార’ వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
పర్యవేక్షించేదివీరే..
జిల్లా స్థాయిలో డీఈఓ, డీవైఈఓ, ఎస్‌ఎస్‌ఏ పీవో, ఏఎంఓ, సీఎంఓ, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఎస్‌ఎంసీ సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాలు కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయి. సీఆర్‌పీలు ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు విద్యార్థులతోనే ఉంటారు.
సామర్థ్యం పెరుగుతుంది..
‘జ్ఞానధార’ కార్యక్రమం పూర్తిగా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరుగుతుంది. నిష్ణాతులచే తరగతులు నిర్వహించనన్న నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులను తరగతులకు పంపించే బాధ్యత తల్లిదండ్రులదే.– జి. నాగమణి, డీఈఓ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment