‘జుత్తు’ జగన్‌నాదం | Juttu Jagannayakulu makes of `ys jagan mohan reddy` slogans at meeting | Sakshi
Sakshi News home page

‘జుత్తు’ జగన్‌నాదం

Published Sat, Nov 30 2013 4:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Juttu Jagannayakulu makes of `ys jagan mohan reddy` slogans at meeting

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మీ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. వైఎస్‌ఆర్ అంటే మాకెంత అభిమానమో మీకు తెలుసు. మీకు కూడా ఆయనంటే అభిమానమని మాకు తెలుసు. మీరు ఊ కొట్టారు.. అదే చాలు..  అందరం కలిసికట్టుగా వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళదామని’ పలాస నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులకు బాసటగా నిలిచారు. ఆయన చేసిన జగన్నినాదానికి కోరస్‌గా సై అన్నారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వెంట వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్న జగన్నాయకులు దీనిపై కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మందస మండలం హరిపురం వద్ద కొబ్బరితోటలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. 
 
 మందసతోపాటు వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు చెందిన పీఏసీఎస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, ఏఎంసీ అధ్యక్షులు, పలువురు సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు  సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన మనసులో మాట బయట పెట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించడం ద్వారా కాంగ్రెస్ చె య్యరాని తప్పు చేసింది. ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి మనుగడ లేదు. దివంగత వైఎస్‌ఆర్ ఎంతగా ఆదరించారో నాకు తెలుసు. ఆయన కలలను సాకారం చేయడం వైఎస్‌ఆర్ సీపీతోనే సాధ్యమవుతుంది. అయితే మీ అందరి సహకారం కావాలి. మీరు ఏం చెబుతారో తెలుసుకోవాలని పిలిపించానని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆయనతో పాటే మన పయనం ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. 
 
 నినాదాల హోరు
 ఎమ్మెల్యే మనసలోని మాట బయటకు వచ్చిన వెంటనే సమావేశ ప్రాంగణం వైఎస్‌ఆర్ జిందాబాద్, జగన్ జిందాబాద్ అన్న నినాదాలతో మార్మోగింది. అనంతరం ప్రసంగించిన పలువురు సర్పంచులు, ఇతర ముఖ్యనేతలు ఎమ్మెల్యేకు పూర్తి మద్దతు ప్రకటించారు.  వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపారు. దీంతో పలాస నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ పూర్తిగా వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఆమదాలవలస, టెక్కలి, పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉంటారా? పార్టీ మారుతారా? అనే అంశంపై చర్చ సాగుతున్నది. వైఎస్‌ఆర్ ద్వారా పార్టీలోకి రావడమే కాకుండా, ప్రజలకు బాగా చేరువయ్యేందుకు దివంగత వైఎస్‌ఆర్ చేపట్టిన పథకాలే ముఖ్య కారణమనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని పలువరు కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మనుగడ కోల్పోయే పార్టీలోనే ఉండి మనం కూడా మనుగడ కోల్పోదామా? లేక ప్రజలకు చేరువవుతున్న పార్టీ వైపు వెళదామా? అనే విషయంలో ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళితే తమకు పదవులు దక్కవనే సందేహంలోనూ వారు ఉన్నట్లు సమాచారం. అయితే మనుగడేలేని పార్టీ కంటే అధికారంలోకి రాబోయే పార్టీలోనే ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేల వద్ద వారి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement