'టిక్కెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా'
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుడు కె.శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ కేసీఆర్‌ను కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీకాంతాచారి తల్లి విజ్ఞప్తిని కేసీఆర్ తిరస్కరించారు. దీంతో కేసీఆర్ ఇంటి ఎదుట శ్రీకాంతాచారి తల్లి నిరసనకు దిగారు. తనకు టికెట్ ఇవ్వకుంటే ఎల్బీనగర్ చౌరస్తాలో తన కుమారుడిలానే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు.
నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశాడు. 2009, నవంబర్ 30న ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడురోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. తన కొడుకు తెలంగాణకోసం ప్రాణాలు అర్పించినా తమను రాజకీయ నేతలు పట్టించుకోవడం లేదని శ్రీకాంతాచారి తల్లి వాపోయారు.