సాక్షి, కడప : చెన్నై–ముంబై కారిడార్ రైలు మార్గంలో జిల్లాలో అనుసంధానంగా నిర్మితమైన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌లో రాజధానికి రైలు అనే అంశం ఇప్పుడు జిల్లా వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎర్రగుంట్ల–నంద్యాల మార్గంలో ధర్మవరం–విజయవాడ మధ్య ప్యాసింజర్ రైలును నడుస్తోంది. అయితే ఈ రైలు జిల్లా కేంద్రంలోని ప్రజలు రాజధానికి వెళ్లేందుకు అనుకూలంగా లేదనే వాదన వినిపిస్తోంది.
ప్యాసింజర్ రైలు నడపాలని నిర్ణయం..
కడప–విజయవాడ మధ్య ప్యాసింజర్ రైలును నడిపేందుకు రైల్వే అధికారులు యోచిస్తున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి రోజున రైలును పట్టాలు ఎక్కించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైలు కడప నుంచి విజయవాడ మధ్య నడిపిస్తే రాజధానికి వెళ్లేందుకు మార్గం సుగమం అవతుంది. ఈ రైలుకు ఫర్మిషన్ తెచ్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దిశగా దృష్టి సారించినట్లు రైల్వే వర్గాలు అంటున్నాయి.
ఉదయానికి చేరుకునేలా..
కడప–విజయవాడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు కడప రైల్వేస్టేషన్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉదయాన్నే విజయవాడకు చేరుకునేలా రైలును నడపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సాయంత్రం తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఉన్నందున రాత్రి వేళలో త్వరలో ప్రవేశపెట్టబోయే ప్యాసింజర్‌ను నడిపిస్తే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని, అదే విధంగా విజయవాడలో కూడా రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉదయాన్నే కడపకు చేరుకునేలా రైలు రాకపోకలను నిర్ణయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు పై విధంగా రైలు నడిచేలా కృషిచేయాలని కోరుతున్నారు.
అందుబాటులోకి లైను..
ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం రైల్వేస్టేషన్‌లో ఫిబ్రవరి 21న కృష్ణపట్నం రైల్వేలైన్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. కాగా ఈ మార్గంలోని టన్నెల్ కిలో మీటర్ మేర పనులు పెండింగ్‌లో ఉన్నందువల్ల అప్పట్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేలేకపోయారు. అయితే ఈ మార్గాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ట్రయల్‌రన్ నిర్వహించారు. గత శుక్రవారం జీఎం గజనాన మాల్యా ఈ మార్గాన్ని పరిశీలించారు.
ప్రయాణం కోసం ఎదురుచూపులు..
కడప –నెల్లూరు జిల్లాలకు సరిహద్దులో ఉన్న వెలికొండలను తొలిచి.. కృష్ణపట్నంకు వెళ్లేలా రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోనే పెద్దదిగా ఈ టన్నెల్స్‌కు గుర్తింపు రానున్నది. 7.5 కిలోమీటర్ల మేర గుహలో రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణం మరపురాని అనుభూతిగా ఉంటుందని ప్రయాణికు భావిస్తున్నారు. జిల్లా వాసులు ఈ మార్గంలో రాజధానికి చేరుకునేలా ప్యాసింజర్ రైలు కోసం ఎదురుచూస్తున్నారు.
గూడ్స్ రైళ్లకు గ్రీన్‌సిగ్నల్..
ఈ మార్గంలో ముందుగా గూడ్స్ రైళ్లను నడిపించేందుకు రైల్వే సమాయత్తం అవుతుంది. సరుకుల రవాణాకు సంబంధించి గూడ్స్ రైళ్లు కృష్ణపట్నం రైల్వే లైనులో నడవనున్నాయి. ప్రధానంగా రేణిగుంటకు వెళ్లి కృష్ణపట్నంకు వెళుతున్న బొగ్గు తదితర సరకుల రవాణా ఓబులవారిపల్లె నుంచి నడిపించేందుకు రైల్వే కసరత్తు చేస్తోంది. దీంతో రేణిగుంటకు వెళ్లకుండా కొత్తగా నిర్మితమైన రైలు మార్గంలో గూడ్స్ రైళ్లు నడువనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment