కొలువు పేరిట టోకరా.. | Kadapa Woman Cheated As Name With Jobs In TDP Government | Sakshi
Sakshi News home page

కొలువు పేరిట టోకరా..

Published Tue, Oct 22 2019 11:40 AM | Last Updated on Tue, Oct 22 2019 11:40 AM

Kadapa Woman Cheated As Name With Jobs In TDP Government - Sakshi

సాక్షి, కడప : కడపకు చెందిన ఓ మహిళ గత ప్రభుత్వంలో సర్వశిక్ష అభియాన్‌తోపాటు సాఫ్ట్‌వేర్, బ్యాంకుఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆశచూపి  జిల్లా వ్యాప్తంగా పలువురి వద్ద కోట్లలో వసూళ్లకు పాల్పడింది. ఎస్‌ఎస్‌ఏలో సీఆర్‌పీ ఉద్యోగానికి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకుంది. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అడ్వాన్సులు తీసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం పలువురి నుంచి రూ.3 లక్షలకు తక్కువ లేకుండా వసూలు చేసింది. బ్యాంకు ఉద్యోగాలంటూ  కొందరి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసింది. కడప నగరంతోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజుపాలెం, బద్వేలు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో పలువురు నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసింది.

ఈ మొత్తం కోట్లలోనే ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అప్పట్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు ఉద్యోగాల కోసం సదరు మహిళకు సిఫార్సు చేస్తూ పలువురిని పంపారు. వారంతా ఆ మహిళకు డబ్బులు ముట్టజెప్పారు. టీడీపీ నేతల అండతోనే సదరు మహిళ వసూళ్ల దందాకు దిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య అధికారుల పేర్లను సైతం వాడి ఆ మహిళ నిరుద్యోగులను మోసగించినట్లు తెలుస్తోంది. బాధితుల సొమ్ముతో సదరు మహిళ కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేసి దర్పం వెలగబెడుతోంది. కడప నగరంలో ధనిక వర్గం ఉండే ప్రాంతంలో విలాసవంతమైన జీవితాన్ని వెలగబెడుతోంది.

డామిట్‌ కథ అడ్డం తిరిగింది
ప్రభుత్వం మారడంతో సదరు మహిళ బండారం బయటకు పొక్కింది. ఉద్యోగం ఇప్పించక, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు కొందరు నిలదీశారు. డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆమె కొత్త ఎత్తుగడకు తెరలేపింది. వారిని వంచించేందుకు ఐపీని ఆయుధంగా వాడింది. బాధితుల్లో  16 మంది వద్ద పలు వ్యాపారాల పేరుతో అప్పులు చేసినట్లు చూపించి ఐపీ నోటీసులు పంపింది. దీంతో బిత్తర  పోయిన బాధితులు ఆ మహిళను సంప్రదించారు. తాను డబ్బులిచ్చేది  లేదంటూ సదరు మహిళ ఎదురు బెదిరింపులకు దిగింది.  చేసేది లేక బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఉద్యోగం కోసం ఆమెకు డబ్బులు ఇచ్చిన కొందరు ముఖ్యులకు మాత్రం కొంతలో కొంత డబ్బులు చెల్లిస్తానని, గొడవ చేయవద్దని సర్దుబాటు ప్రయత్నానికి దిగింది. చాలాకాలంగా ఇదే చెబుతున్నా డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదని ముఖ్యులైన బాధితులు కొందరు ‘సాక్షి’కి తెలిపారు.

ఆమెపై ఫిర్యాదు చేసేందుకు కొందరు బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. జిల్లా ఎస్పీకి సైతం రాత పూర్వకంగా  ఫిర్యాదు చేసేందుకు వారు సిద్దమయ్యారు. ఈ సందర్బంగా పలువురు పాత్రికేయులను కలిసి మహిళ దోపిడీని వివరించారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతోనే డబ్బులు ఇచ్చామని వారు వాపోయారు. సీఎం రమేష్‌ పీఏ సూచనతోనే ఆలూరి అశ్విని  ఉద్యోగం కోసం డబ్బులు ముట్టజెప్పినట్లు ఆమె బావ ఏఎం కొండయ్య ‘సాక్షి’ ముందు వాపోయారు. సమీప బంధువులు సీఎం రమేష్‌ ఇంటిలో పనిచేస్తారని, వారి సూచన మేరకే మహిళకు డబ్బులు ముట్టజెప్పినట్లు చెప్పారు. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సిఫార్సు చేయడంతోనే ఉద్యోగం  కోసం రూ. లక్ష మహిళకు ముట్టజెప్పినట్లు బాధితుడు వివరించారు. టీడీపీ నేతల అండతోనే మహిళ  కోట్లలో వసూలు చేసిందని వారంతా వాపోతున్నారు. అధికారులు స్పందించి ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లకు పాల్పడిన మహిళపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
 

⇔ ప్రొద్దుటూరుకు చెందిన జి.రాజశేఖర్, రాజుపాలెంకు చెం దిన సురేష్‌తోపాటు  జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఓ మహిళకు ఉద్యోగాల కోసం అడ్వాన్సుల కింద లక్షలు చెల్లించారు. కోటి రూపాయలకుపైనే వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం లేదు. ఒక్కపైసా తిరిగి ఇవ్వలేదు

⇔ పులివెందులకు చెందిన ప్రదీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం రూ.3 లక్షలు ముట్టజెప్పాడు. కడపలోని ఆయనకు తెలిసిన మురళీకృష్ణ ఆచారి ద్వారా ఈ మొత్తాన్ని ఉద్యోగం ఇప్పిస్తానన్న మహిళకు అందజేశాడు. ఏడాది అవుతున్నా అతనికి జాబు రాలేదు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి ద్వారా జాబు విషయమై పలుమార్లు మహిళతో మాట్లాడారు. జాబు  ఇప్పించలేదు..డబ్బు ఇవ్వలేదు.. చివరకు ఐపీ నోటీసు అందింది.

ప్రొద్దుటూరుకు చెందిన సుధాకర్‌ సర్వశిక్ష అభియాన్‌లో సీఆర్‌పీ ఉద్యోగం కోసం సదరు మహిళకు రూ. 50 వేలు ముట్టజెప్పారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన రూ. 2 లక్షల మొత్తాన్ని చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అతనికి ఉద్యోగం ఇవ్వలేదు..డబ్బులూ ఇవ్వలేదు.. తీరా చూస్తే ఐపీ నోటీసు వచ్చింది.

⇔ మండల కేంద్రమైన రాజుపాలెంకు చెందిన నాగ సురేంద్ర ఆంధ్రాబ్యాంకులో అటెండర్‌ ఉద్యోగం కోసం సదరు మహిళకు రూ. లక్ష ముట్టజెప్పారు. ఏడాదైనా జాబు లేదు.. డబ్బులు తిరిగి ఇవ్వలేదు.. ఇప్పుడు ఆయనకు ఐపీ నోటీసు వచ్చింది.

⇔ కడపకు చెందిన ఆరూరు అశ్విని సీఎం రమేష్‌ పీఏ సుధాకర్‌ సూచనతో సర్వశిక్ష అభియాన్‌లో కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టు కోసం రూ.80 వేలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌ కింద రూ.50 వేలు ముట్టజెప్పారు. జాబు వచ్చిన మరుక్షణమే మిగిలిన రూ.30 వేలు చెల్లించేలా మాట్లాడుకున్నారు. రూ.50 వేల మొత్తాన్ని అశ్విని బావ ఏఎం కొండయ్య ద్వారా సదరు మహిళకు ముట్టజెప్పారు. జాబు లేదు...డబ్బులు ఇవ్వలేదు. చివరకు  ఐపీ నోటీసు వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement