బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు, ముత్తుకూరు: 2019 ఎన్నికలంటే టీడీపీకి ఓటమి భయం పట్టుకొందని, విశాఖపట్నం విమాశ్రయంలో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఇందులో భాగమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముత్తుకూరు మండలంలోని పిడతాపోలూరులో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలోని వివిధ గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో కాకాణి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 140 నుంచి 150 స్థానాలు కైవశం చేసుకొంటుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన మోసాలు, అబద్ధాలు, ప్రచారాలకే పరిమితమైందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 720కిపైగా వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలు తమ కుటుంబాలకు భరోసా ఉంటాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
సర్వేపల్లిలో భారీ మెజార్టీ
సర్వేపల్లి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కాకాణి ధీమా వ్యక్తం చేశారు. అయితే భారీ మెజార్టీ సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీరు–చెట్టు పథకం పేరుతో ప్రజాధనం దోపిడీ చేశారన్నారు. శ్రీశైలం నుంచి సాగునీరు తీసుకురాలేక మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మొహం చాటేశారన్నారు. యాష్‌పాండ్‌లకు వ్యతిరేకంగా గతంలో పోరాటాలు చేసిన వారు ఇప్పుడు కాంట్రాక్టులతో లబ్ధి పొందుతున్నారంటూ మండిపడ్డారు. సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు పోలిరెడ్డి చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment