నీతి గురించి మాట్లాడే అర్హత సోమిరెడ్డికి లేదు | Kakani Govardhan Slams Somireddy Chandramohan Reddy | Sakshi
Sakshi News home page

నీతి గురించి మాట్లాడే అర్హత సోమిరెడ్డికి లేదు

Published Fri, Jan 11 2019 11:54 AM | Last Updated on Fri, Jan 11 2019 11:54 AM

Kakani Govardhan Slams Somireddy Chandramohan Reddy - Sakshi

నెల్లూరు : మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): దోచుకోవడమే పనిగా పెట్టుకున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి నీతి గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, ఎవరూ చేపట్టలేని విధంగా ప్రజాసంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. చుట్టుపక్కల గ్రామాలు లేకపోయినా ఇసుకేస్తే రాలనంత మంది స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. సభ ముగిసిన మరుక్షణమే మంత్రి సోమిరెడ్డి సభకు జనం రాలేదని ఎప్పటిలాగే అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు.

వారికి అలవాటైపోయింది
సీఎం చంద్రబాబు, మంత్రి చంద్రమోహన్‌రెడ్డిలకు నిద్రలేచింది మొదలు అబద్ధాలాడడం, పక్కవారిపై బురద జల్లడం అలవాటైపోయిందన్నారు. జగన్‌ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. సీఎం, సోమిరెడ్డి పంచభూతాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పోలవరంలో దోచుకున్నదానిని గిన్నీస్‌రికార్డులో ఎక్కిస్తే బాగుంటుందన్నారు.

ప్రజలు గమనిస్తున్నారు
మోదీ, చంద్రబాబు, పవన్‌ ముగ్గురూ కలిసినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే ఎన్నికలకు వెళ్లారని, కేవలం రెండుశాతం ఓట్లు తేడా వచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న సోనియాగాంధీని ఎదిరించిన చరిత్ర వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని చెప్పారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ నుంచి అమరావతికి పారిపోయిన చరిత్ర చంద్రబాబుదనే విషయం మరిచిపోవద్దన్నారు. బాబు మొదట్లో ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీని అభినందించారన్నారు. తమ నేత వైఎస్‌ జగన్‌ మొదటినుంచి ఒకే మాటపై ఉన్నారన్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చే ప్రజలకు రేషన్‌ డీలర్స్‌ భోజనం వసతి కల్పించాలని ఆదేశాలివ్వడం సిగ్గుచేటన్నారు.

చర్చకు సిద్ధమా?
తాను ఆరోపిస్తున్న ప్రతి మాటకు ఆధారాలతో వస్తానని, అదే విధంగా మంత్రి సోమిరెడ్డి బహిరంగ చర్చకు ఎప్పుడు వస్తారో చెప్పాలని కాకాణి కోరారు. ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సమయం, తేదీ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి చెప్పాలన్నారు. అనవసర ఆరోపణలు చేయకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడడం సోమిరెడ్డి మానుకుని చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో నాయకులు చిల్లకూరు సుధీర్‌రెడ్డి,  మందల వెంకటశేషయ్య, నెల్లూరు శివప్రసాద్, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, ఉప్పల శంకరయ్యగౌడ్, చాట్ల వెంకటసుబ్బయ్య, హరించంద్రారెడ్డి పాల్గొన్నారు.

మరో మూడు నెలల్లో జగన్‌ సీఎం
ముత్తుకూరు: రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బ్రహ్మదేవిలో పంచాయతీలోని వివిధ గ్రామాల నుంచి టీడీపీని వీడి వంద కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో కాకాణి ప్రసంగించారు. ప్రజాసంకల్ప యాత్ర చంద్రబాబుకు కునుకు లేకుండా చేసిందన్నారు. జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా దోపిడీ సాగించాయన్నారు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి వ్యవసాయం, రైతులు, సాగునీటి పారుదలను పట్టించుకోకుండా దోపిడీ చేయడానికి, వైఎస్‌ జగన్‌ను దూషించడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ, సర్వేపల్లిలోనూ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే ఇంటి బిడ్డగా సేవ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, నాయకులు పోలిరెడ్డి చిన్నపరెడ్డి, షేక్‌ బషీర్, బందెల వెంకటరమణయ్య, షేక్‌ మస్తాన్, బట్టికాల మధుసూదన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement