'బాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారు'
కాకినాడ : కాపు ఉద్యమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో శనివారం ఆయన 'సాక్షి' తో మాట్లాడుతూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కాపు సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నామన్నారు. కర్నూలులో నిర్వహించే కాపు సత్యాగ్రహ దీక్షలో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. బాబు వైఖరిని కాపు జాతంతా గమనిస్తోందన్నారు.
కాపులకు బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చినట్లే యువతకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత నిరుత్సాహంగా ఉందన్నారు. యువతకు ఉపాధిలేకపోతే చెడుమార్గంలోకి వెళ్లే అవకాశముందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటమార్చడం ఆయన స్థాయికి తగదన్నారు. హోదా కోసం అందరూ ఓ గొడుగు కిందకు వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలకూ హోదాకోసం ఇప్పటికే లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మార్చి 26న కాకినాడలో కాపు న్యాయవాదులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ముద్రగడ తెలిపారు.