సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నిధులున్నా రోడ్లు, తాగునీటి పైపులైన్ పనులు చేయకుండా అధికారులు ప్రజలను నరకయాతన పెడుతున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. ‘2011 నుంచి దాదాపు రూ.7 కోట్ల మేర నిధులున్నా ఖర్చు చేయడం లేదు. అండర్‌గ్రౌండ్ పనులతో నగరం నాశనమైంది. మండలంలో తాగునీటి పథకాలకు కరెంటు కోసం డబ్బులు కట్టినా కనెక్షన్ ఇవ్వడం లేదు. గత డీఆర్సీలో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ నిధుల విషయమై చర్చించినా లాభం లేదు. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలి అనే చిత్తశుద్ధిలేదు. అధికారులు కనీసం రివ్యూ చేయడం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం?’ అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన ఆదేశాలకే దిక్కులేదని, నగరంలో అభివృద్ధి ఊసేలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపాలని చెప్తున్నామని, అలా ప్రతిపాదనలు రాక తిప్పిపంపాల్సి వస్తోందని కలెక్టర్ వీరబ్రహ్మయ్య తెలిపారు. ఇలాగైతే బల్దియా అధికారుల తీరును సీరియస్‌గా తీసుకోవాల్సివస్తుందని ఇన్‌చార్జి మంత్రి పొన్నాల హెచ్చరించారు.
అవసరమైన పనులకు సంబంధించి రెండు రోజుల్లో ప్రతిపాదనలు రూపొం దించాలని, అందుబాటులో ఉన్న నిధులకు అదనంగా 20 శాతం పనులు తీసుకోవాలని సూచిం చారు. భూగర్భ డ్రైనేజీ పనులపై గంగుల, ఎంపీ పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్కీం పూర్తి చేయాలంటే మరో రూ.150 కోట్లు అవసరమవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపాలని, హడ్కో రుణం కోసం ప్రయత్నిద్దామని పొన్నాల సూచించారు.
తాగునీటి పథకానికి ఆటంకాలు..
రామగుండం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ నీటిని మళ్లించే స్కీంకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సరఫరా, రాజీవ్ రహదారి విస్తరణలో సమస్యలను ప్రస్తావించారు. ‘రూ.65 కోట్లతో 25వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలు పంపాను. మున్సిపాలిటీకి ఎస్సారెస్పీ నుంచి తాగునీరు అందించాలని కోరాను. నాలుగేళ్లవుతున్నా అతీగతీ లేదు.
రాజీవ్హ్రదారి విస్తరణ పనుల్లో లోపాలు ఎత్తిచూపినా పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. తాను మున్సిపల్ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడిగాా అప్పటి ముఖ్యమంత్రిపై ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధికి ఆటంకం కలుగలేదని గుర్తుచేశారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ ఒక టీఎంసీ నీటిని మళ్లించేందుకు ఎస్సారెస్పీ అధికారులు అంగీకరించలేదన్నారు. 2011లో ఎస్సారెస్పీ అనుమతించిన డాక్యుమెంటు తనదగ్గరుందని సత్యనారాయణ స్పష్టం చేశారు.
తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని, నీటి కేటాయింపును ఎలా నిరాకరిస్తారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో రాజకీయ సంకుచిత ధోరణి సరికాదని అనగా, మంత్రి తీవ్రంగా స్పందించారు. పెన్షన్లు, ఇళ్ల పంపిణీపై కూడా ఈటెల, శ్రీధర్‌బాబు సై అంటే సై అంటూ సవాలు చేసుకున్నారు. సకలజనుల సమ్మె సమయంలో తెలంగాణలో పోలీసుల పహారాలో పెన్షన్లు పంచారని, ఇప్పుడేమయిందని ఈటెల ప్రశ్నించారు. పెన్షన్లు తదితర ప్రయోజనాలు కల్పించకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఈటెల అన్నారు. తామిచ్చినన్ని పెన్షన్లు ఎవరివ్వలేదని, తమకు కూడా అందుకు అభ్యంతరం లేదని శ్రీధర్‌బాబు జవాబిచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడే సమయంలో రామగుండం నీటి విషయాన్ని తిరిగి లేవనెత్తారు. మంత్రి నీటి పథకాన్ని అడ్డుకున్నారని పేర్కొనడం అర్థరహితమని, సమీక్షల్లో వ్యక్తిగత విమర్శలు తగవన్నారు. తాను వాస్తవాలే చెప్పానని సోమారపు వివరిస్తుండగానే శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని లక్ష్మణ్‌కుమార్‌ను వారించారు.
మంథనిలో రోడ్లు అద్దంలాగా ఉంటే పక్కన ఉన్న తన నియోజకవర్గంలో మాత్రం అధ్వానంగా ఉన్నాయని, తాను టీడీపీ సభ్యుడిని కాబట్టి వివక్ష చూపుతున్నారని పెద్దపల్లి శాసనసభ్యుడు విజయరమణారావు విమర్శించారు. ‘నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎస్సారెస్పీ నుంచి సాగునీరందించాలని ప్రతిపాదిస్తే పట్టించుకోకపోవడంతో వందల ఎకరాలు ఎండిపోయాయి.
డీఆర్సీలో చెప్పిన దాంట్లో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై, మంత్రులపై ఆయన విమర్శలకు దిగగా ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ అభ్యంతరం తెలిపారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయ లబ్ధికోసం ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని మధుయాష్కి అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధం లేని, ఇక్కడ పరిష్కారానికి అవకాశం లేని అంశాలను ఎందుకు చెప్తున్నారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా విజయరమణారావు, పొన్నం ప్రభాకర్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. అనవసరంగా అరవకంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేయగా అదేస్థాయిలో విజయరమణరావు సమాధానమిచ్చారు. మాది రెండు కళ్ల విధానం కాదని పొన్నం, తామే నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నట్టు విజయరమణారావు పరస్పరం చురకలేసుకున్నారు. మంత్రులు పొన్నాల, శ్రీధర్‌బాబు కూడా విజయరమణారావు మీడియాలో ప్రచారం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారంటూ తప్పుబట్టారు.
వీరిమధ్య వాగ్వివాదం జరుగుతున్నా సమావేశంలో ఉన్న టీడీపీ సభ్యుడు సుద్దాల దేవయ్య మౌనంగానే ఉన్నారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించేందుకు సమయం లేదని భావించిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గాల వారీగా ప్రధాన సమస్యలను మాత్రమే ప్రస్తావించాలని శాసనసభ్యులను కోరారు. ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలపై ఆయా నియోజకవర్గ సమన్వయ అధికారులు వచ్చే నెల 5లోగా పరిశీలించి పరిష్కారదిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో అవసరాలు తీర్చాకే ఎల్లంపల్లి నీటిని హైదరాబాద్‌కు తరలించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని గత విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తావించి నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిని కలిస్తే సమగ్ర నివేదిక కావాలన్నారని, పది నెలలు గడుస్తున్నా నివేదిక తయారు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 48 మోడల్ స్కూళ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు.
18న డీఆర్సీ...
జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశం అక్టోబర్ 18న నిర్వహిస్తామని ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. గత సమావేశంలోనూ, ఈ సమీక్షలోనూ సభ్యులు ప్రస్తావించిన అంశాలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదికలతో అధికారులు సమావేశానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
సమీక్షకు డుమ్మా...
చాలాకాలం తరువాత జిల్లా అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఇన్‌చార్జి మంత్రి పర్యటన రెండు రోజుల క్రితమే ఖరారయ్యింది. సమయం తక్కువగా ఉండడంతో శాసనసభ్యులకు సమీక్ష సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని స్వయంగా పొన్నాల లక్ష్మయ్యే ఇచ్చారు.
అయినా కేటీఆర్, రమేష్‌బాబు, కె.విద్యాసాగరరావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సంతోష్‌కుమార్, భానుప్రసాద్‌రావు హాజరుకాలేదు. ఈ సమావేశంలో కొప్పుల ఈశ్వర్, ఎల్.రమణ, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకరరెడ్డి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ చేతి ధర్మయ్య, జేసీ అరుణ్‌కుమార్, జగిత్యాల సబ్‌కలెక్టర్ శ్రీకేశ్ తదితరులు పాల్గొన్నారు.
హాట్‌హాట్‌గా..
Published Sat, Sep 28 2013 3:46 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement