విషాదంలో కర్నూలు జిల్లా వాసులు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి మరణవార్తతో కర్నూలు జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు. సన్నిహితులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చివరి శ్వాస వరకు శోభానాగిరెడ్డి ప్రజల కోసం సేవలందించారు. బుధవారం రాత్రి వరకు కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉన్నారు. నిన్న షర్మిలతో కలిసి ర్యాలీలో పాల్గోన్న శోభానాగిరెడ్డి లేరనే వార్తను ఆళ్లగడ్డ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
1997 లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి శోభానాగిరెడ్డి ప్రజాసేవకు అంకితమయ్యారు. నిత్యం జనం కోసం తపించే శోభానాగిరెడ్డి భౌతికంగా దూరమయ్యారనే వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులను శోక సముద్రంలో మునిగిపోయారు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడటంతో హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం 11.05 గంటకు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.