ఇద్దరు ‘చంద్రు’ల ముచ్చట్లు
ఇద్దరు ‘చంద్రు’ల ముచ్చట్లు
Published Sat, Aug 16 2014 12:50 AM | Last Updated on Wed, Sep 5 2018 8:33 PM
సాక్షి, హైదరాబాద్: నిత్యం పరస్పర విమర్శలతో హోరెత్తిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మరోసారి చేతులు కలిపారు. సుమారు ముప్పావు గంటపాటు చర్చలు జరిపారు. స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని సాంప్రదాయంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమం వీరికి చర్చావేదిక అయింది.
వీవీఐపీలకు ఏర్పాటు చేసిన హాలులో ఇద్దరు సీఎంలు పరస్పరం పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కొద్దిసేపు వారి మధ్య కూర్చున్నారు. గవర్నర్ కూడా ఆ హాలులోకి ప్రవేశించగానే ఇద్దరు సీఎంలు ఆయనకు చెరొక పక్కన కూర్చున్నారు. ఆయన సమక్షంలోనే వీరిద్దరూ సుమారు ఇరవై నిమిషాలకు పైగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మంత్రులు, ఇతర ముఖ్యులు వారికి దగ్గరగా వెళ్లడానికి సాహసించలేదు. అయితే, వీరిద్దరి ముచ్చట్లపై వారు ఆసక్తి కనబరిచారు. ఎట్‌హోం కార్యక్రమం ముగిసిన తర్వాత జాతీయపతాకానికి గౌరవవందనం చేశారు. అటు నుంచి ఇద్దరు సీఎంలతో కలసి గవర్నర్ నివాసంలోకి వెళ్లారు. అక్కడ సుమారు 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
చంద్రబాబు, కేసీఆర్‌లు జరిపిన చర్చల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎంసెట్ అడ్మిషన్లు, నీటి పంపకాలు, కరెంటు సమస్యలు, పలు సంస్థల్లో విభజన సమస్యల వంటివాటిపై రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన విభేదాలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వారి మధ్య సామరస్యం కోసం ప్రయత్నిస్తానని గవర్నర్ గతంలోనేప్రకటించారు. ఈ మేరకు ఆయన చొరవ చూపినట్లు తెలుస్తోంది. అయితే, వీరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయి? ఏ నిర్ణయాలకు వచ్చారు అనే వివరాలు తెలియరాలేదు.
కాగా, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, రెండు రాష్ట్రాల స్పీకర్లు ఎస్.మధుసూదనాచారి, కోడెల శివప్రసాదరావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పి.మహేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ, ఆంధ్రా పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్.రఘువీరా రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్, బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కవిత, వీహెచ్, రాపోలు ఆనంద భాస్కర్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయంత్రం 5.30కు ప్రారంభమైన ఈ కార్యక్రమం 6.25కు ముగిసింది.
Advertisement
Advertisement