ఎమ్మెల్సీగా కేశవ్ ఏకగ్రీవం!
♦ అధికార ప్రకటనే తరువాయి
♦ ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ
అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పయ్యావుల కేశవ్ ఎన్నిక ఏగ్రీవమయింది. అధికార ప్రకటనే వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్, పయ్యావుల శ్రీనివాసులు, యాటా వెంకటసుబ్బన్న నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను అధికారి బి.లక్ష్మికాంతం, డీఆర్‌ఓ హేమసాగర్ పరిశీలించారు. మూడు నామినేషన్లలో యాటా వెంకటసుబ్బన్న నామినేషన్‌ని తిరస్కరించారు.
పయ్యావుల శ్రీనివాసులు నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. బరిలో పయ్యావుల కేశవ్ ఒక్కరే నిలిచారు. పోటీ ఎవరూ లేనందున కేశవ్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి లాంచనంగా ప్రకటించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగినంత బలం లేని కారణంగా వైఎసాఆర్ కాంగ్రె స్ పార్టీ దూరంగా ఉంది. ఇది ఒక రకంగా కేశవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కలిసి వచ్చింది.