టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేశవ్
జూన్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో ‘అనంత’లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. తెలుగుదేశంపార్టీ తరఫున ఎన్నికల బరిలోకి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దిగనున్నారు. బుధవారం రాత్రి టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని ప్రకటించింది.
పయ్యావుల కేశవ్‌తో పాటు ఎమ్మెల్సీ టిక్కెట్టును ఆశించిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి నిరాశే ఎదురైంది. బాలకృష్ణ కోసం సీటు త్యాగం చేయడం, దీనికి తోడు మైనార్టీ కావడంతో టిక్కెట్టు దక్కుతుందని ఆశపడ్డారు. అయితే.. పయ్యావుల కేశవ్‌ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు మొదట్నుంచీ భావిస్తున్నారు. దీంతో ఘనీని పక్కనపెట్టారు.
కేశవ్ ఎంపికతో ఇద్దరి మంత్రుల్లో ఒకరికి గుబులు
జూన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయితే, ఆ తర్వాత సెప్టెంబరులో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేశవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లె రఘునాథరెడ్డిని తప్పించి, నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పల్లె రఘునాథరెడ్డి పనితీరుపైనా సీఎం అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు ఉద్వాసన ఉంటుందని ఓ కీలక నేత చెబుతున్నారు. మరో మంత్రి పరిటాల సునీతపైనా చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. సునీత తనయుడు శ్రీరాంతో పాటు అనుచరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సునీత వ్యతిరేకీయులు చంద్రబాబుకు పలుసార్లు ఫిర్యాదులు చేశారు. వీటిని కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబుపై జిల్లా నేతల నుంచి ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో ఇద్దరు మంత్రులకూ ఉద్వాసన పలికి కొత్త ముఖాలకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశమూ లేకపోలేదని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో అన్నారు.
విధేయతకు పెద్దపీట
Published Thu, May 21 2015 3:28 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement