
ధర్మవరం టౌన్: ప్రజాసమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రను ఎదుర్కొనే ధైర్యం లేక నిరాధార ఆరోపణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్యారడైజ్ పత్రాల్లో వైఎస్ జగన్ పేరుందని, నల్లకుబేరుల జాబితాలో జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని నిరాధారంగా చంద్రబాబు తన అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయించారన్నారు. తాను సీఎం పదవిలో ఉన్నాననే విషయాన్ని కూడా మరిచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి నిందారోపణలు చేశారన్నారు.
బాబు ఆరోపణలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ ప్యారడైజ్ వ్యవహారంలో తాను ఉన్నట్లు చిన్న ఆధారం చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారన్నారు. ఇందుకు కనీసం ఒక్క ఆధారం చూపించ లేక చంద్రబాబు మొహం చాటేశారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర నీదని చంద్రబాబుపై కేతిరెడ్డి మండిపడ్డారు. అవినీతి ఆరోపణలతో 25 కేసులలో స్టే తెచ్చుకున్న చంద్రబాబు జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర చారిత్రాత్మకమన్నారు. ప్రజల దీవెనలతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజారిటీతో గెలిచి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు.