శ్రీకాకుళం : జిల్లా నుంచి అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రతిభాభారతికి ఏదైనా కీలక పదవి లభిస్తే తమ పరిస్థితి ఏమిటన్నదానిపై స్వపార్టీలోనే ప్రత్యర్థి వర్గీయులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమెకు మండలి చైర్మన్‌పదవిగానీ, ఏదైనా కేబినెట్ పదవిగానీ లభిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆమెపై వ్యతిరేకంగా ఉన్నవారిలో గుబులు మొదలైంది. వాస్తవానికి ప్రతిభకు ప్రతిపక్ష పార్టీలకంటే సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా పనిచేసినప్పుడు ఆమెకు పార్టీలోని అందరూ సన్నిహితంగానే ఉండేవారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రిజర్వేషన్ మారి రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చిననాటి నుంచి కళా వెంకటరావుతో విభేదాలు తలెత్తాయి.
తొలిసారి రాజాం నుంచి పోటీచేసినప్పుడు అంతంతమాత్రంగా ఉన్న విభేదాలు రెండో సారి పోటీ చేసేసరికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తన పరాజయానికి కారణం కళావెంకటరావేనన్న వేదన ప్రతిభాభారతిలో ఉంది. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ప్రతిభాభారతి హయాంలోనే అభివృద్ధి చెందినా వారంతా ప్రస్తుతం కళా అణుచరులుగా మారారు. పదవి లేకపోవడంతో ప్రతిభాభారతి ఇప్పటివరకు మౌనంగా ఉండాల్సి వచ్చింది.
అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆమెకు మంత్రి పదవి కానీ, శాసనమండలి చైర్మన్ పదవి కానీ దక్కేవీలుందని ప్రచారం జరుగుతుండడంతో ప్రత్యర్థుల్లో కలవరం మొదలైంది. తమపై కక్ష సాధింపునకు పాల్పడతారేమోనన్న ఆందోళనలో కళా వర్గీయులు ఉన్నారు. ఇటువంటి వాటిని తప్పించుకునేందుకు కొందరు ఇప్పటికే ప్రతిభ ప్రసన్నం కోసం యత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కింజరాపు కుటుంబంతో తొలినుంచి కళా కుటుంబానికి అభిప్రాయ భేదాలున్నాయి.
అటు రాజాం నియోజకవర్గంలోనూ, ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ కళావర్గాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా చిత్తు చేసేందుకు కింజరాపు వర్గం పాటుపడింది. ఎచ్చెర్లలో కళా వెంకటరావును ఎదుర్కొనేందుకు చౌదరి ధనలక్ష్మిని జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యేట్టు చేశారు. రాజాం నియోజకవర్గంలో ప్రతిభా భారతిని ప్రోత్సహిస్తూ వచ్చారు.
ఆమెకు పదవి లేకపోవడం వల్ల కింజరాపు కుటుంబీకులే నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం అభ్యర్థిగా ప్రకటించిన జూపూడి అనర్హుడు కావడంతో అచ్చెన్న చక్రం తిప్పారు. తన ప్రత్యర్థి అయిన కళాకు రాజాంలో చెక్ పెట్టాలంటే ప్రతిభాభారతికి పదవి అవసరమని గుర్తించి ఎమ్మెల్సీగా
ఎన్నికయ్యేలా అధినాయకుడిని ఒప్పించగలిగారు.
అయితే ప్రతిభకు మంత్రి పదవి ఇస్తే కేబినెట్ హోదా కలిగిందే ఇవ్వాలి. అదే జరిగితే సహాయమంత్రిగా ఉన్న కింజరాపు ప్రాధాన్యం కోల్పోయే ప్రమాదం ఉంది. శాసనమండలి చైర్మన్ పదవి కూడా ఆ స్థాయిదే. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా ప్రత్యర్థికి చెక్‌పెట్టనిదే ఆమె నిద్రపోరని ఆ పార్టీ వర్గీయులే గుసగుసలాడుతున్నారు.
‘ప్రతిభ’కు పట్టం కడితే...
Published Tue, Jun 9 2015 1:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement