
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావుకు శాసనమండలిలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. రామారావు 2014 ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగారు. అనంతరం ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ ఎన్నికల్లో రామారావుకు పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆయనకు బదులు పిరియా సాయిరాజ్‌కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన రామారావుకు సముచిత స్థానం కల్పించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ధర్మాన ప్రసాదరావు ‘సాక్షి’కి తెలిపారు.
రామారావుకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వలేక పోయినందున.. ఎన్నికల అనంతరం ఏర్పడబోయే శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని జగన్ తనకు చెప్పారన్నారు. దీంతో ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న రామారావుకు న్యాయం జరిగినట్టయిందని చెప్పారు. నియోజకవర్గంలో అందరూ ఐక్యంగా పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాయిరాజ్ గెలుపునకు కృషి చేయాలని ధర్మాన కోరారు. కవిటి మండలం కొత్తపుట్టుగ గ్రామానికి చెందిన రామారావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుండడంతో జిల్లాలోని యాదవ సామాజిక వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.