పొదలకూరు(సర్వేపల్లి): పొదలకూరు మండలంలో దోస సాగు చేపట్టిన రైతులు నిండా మునిగారు. దోసకాయలు అడిగే నాథుడు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి ఏడాది దోస సాగులో లాభాలు గడించే రైతులు ఈ ఏడాది కూడా సాగుచేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయని ఆశించారు. అయితే దోసకాయల ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో దోసకాయలు రూ.1 మాత్రమే ధర పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర లేకపోవడంతో రైతులు చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరా దోస సాగుకు రూ.10 వేల వరకు ఖర్చుచేస్తే 150 కిలోల దిగుబడి సాధించే అవకాశం ఉంది. సొంత పొలం, ట్రాక్టర్ ఉంటే ఎకరాకు రూ.2 వేల వరకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
కౌలు రైతులకైతే ఎకరాలకు రూ.10 వేలు అవుతుంది. ఈ క్రమంలో 150 కిలోల దిగుబడి సాధిస్తే ధరలు లేని కారణంగా ఎకరాలకు రూ.150 మాత్రమే వస్తుంది. ఇంత తీవ్రస్థాయిలో నష్టం ఇటీవల కాలంలో ఏ పంట సాగులోనూ రాలేదని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి కూడా రైతులు దోసకాయలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడ కూడా డిమాండ్ లేకపోవడంతో రైతులకు ఆదాయం తగ్గిపోయింది. అయితే నెల్లూరు మార్కెట్ కంటే హైదరాబాద్ మార్కెట్ కొంత వరకు మేలంటున్నారు.
ధరలు దిగాలు
మండలంలో నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి, నావూరు, ముదిగేడు, పొదలకూరు, అయ్యగారిపాళెం తదితర గ్రామాల్లో సుమారు 100 ఎకరాల్లో దోస సాగు చేస్తున్నారు. నావూరుపల్లిలో ఒకే రైతు 30 ఎకరాల్లో దోస సాగు చేపట్టి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దోస సాగులో అనుభవం ఉన్నా మార్కెట్ ధరలు పడిపోతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
ఆశలు ఆవిరయ్యాయ్
దోస సాగులో ఆదాయం పొందవచ్చని సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మా గ్రామంలో ముగ్గురు రైతులం 10 ఎకరాల్లో దోస సాగు చేసి నష్టపోయాం. దోసకాయలను అడిగే నాథుడు లేడు. మార్కెట్‌లో ధరలు పెరగకుంటే పశువులను వదిలివేయాలనే ఆలోచనలో ఉన్నాము. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. –కసిరెడ్డి మధురెడ్డి, రైతు, ముదిగేడు.
సాగు చేసి నష్టపోయా
30 ఎకరాల్లో దోస సాగు చేసి నష్టపోయాను. కూలీలు, ఇతర ఖర్చులు చూసుకుంటే ఎకరాకు రూ.10 వేలు ఖర్చయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. హైదరాబాద్‌కు నేనే సొంతంగా ఎగుమతి చేస్తున్నాను. కిలో దోసకాయలు రూ.1 మాత్రమే పడుతున్నాయి. – తలచీరు అరుణప్రసాద్, రైతు, నావూరుపల్లి
Comments
Please login to add a commentAdd a comment