లెవీ సేకరణకు...సమస్యలు హెవీ
విజయనగరం కంటోన్మెంట్ :ఖరీఫ్ సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొనుగో లు చేసి నిత్యావసరాల పథకానికి మళ్లించేందుకు అధికారులు కొత్తగా 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. జిల్లాలో ఈ ఏడాది 1,10,505 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. దీంతో 2,60,876 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా. దీనిలో 76,705 మెట్రిక్ టన్నులు జిల్లాకు అవసరం మేరకు స్థానికంగా వినియోగించుకునే అవసరముంది. మిగతా 1,84,171 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన నిధుల విషయం ప్రశ్నార్థకంగా మారింది. క్వింటాకు రూ.1360 ల చొప్పున రైతులకు మద్దతు ధర చెల్లించవలసి ఉంది. అలాగే కేంద్రాల్లో వినియోగించే పరికరాల కొనుగోలుకు నిధులు కావా లి. ఈసొమ్మును ఎక్క డ నుంచి తీసుకువస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా నిధులు సమకూర్చుకున్నాయి. అయితే ఇంతవరకూ గ్రాంట్ విడుదల కాలేదు. ధాన్యం కొనుగోలుకు గత ఏడాది సెప్టెంబర్ నుంచే సన్నాహాలు ప్రారంభించిన అధికారులు అక్టోబర్ నెల ప్రారంభమైనా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
సిబ్బంది కొరత...
ధాన్యం సేకరణకు ఇప్పటివరకూ సిబ్బందిని కూడా గుర్తించలేదు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇద్దరు సహాయ మేనేజర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. సాంకేతిక సహాయకులు పది మంది అవసరముండగా కేవలం ఒక్కరే ఉన్నారు. ఇంకా తొమ్మిది మందిని గుర్తించాల్సి ఉంది. అలాగే ఇతర సహాయకులు మరో 60మంది ఉండగా ఒక్కరూ లేకపోవడంతో వీరందరినీ కొత్తగా నియమించుకోవాల్సి ఉంది. మొత్తంగా 72 మందికి ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉండగా 70మందిని కొనుగోలు కేం ద్రాలకు సరిపడా నియమించాల్సి ఉంది. ఆరువందల టార్పాలిన్లు అవసరం కాగా, ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 69మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అం టే ఇంకా 531టార్పాలిన్లు కొనుగోలు చేయాల్సి ఉంది. విన్నోయింగ్ మిషన్లు 20 అవసరం కాగా, అన్నీ కొనుగోలు చేయవలసి ఉందని అధికారులు చెబుతున్నారు. తేమ కొలిచే యంత్రాలు 60కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున ఉండాలి. కానీ ప్రస్తుతం 25 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
అంటే ఇంకా 35కొనుగోలు చేయా ల్సి ఉంది. బరువు తూచే స్కే ళ్లు, తూనిక రాళ్లు కూడా దా దాపుగా లేనట్టే! ఇవి రెండే ఉండటంతో మిగతా 58 కొనుగోలు చేయాల్సిందే! హస్క్ రిమూవర్స్ మాత్రం 50 ఉన్నాయి. ఇంకా పది కొనుగోలు చేయాలి. అదేవిధంగా కాలిపర్స్ వంటి పలు పరికరాలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాల్సి ఉంది. మిల్లర్లు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లా వ్యా ప్తంగా 109మిల్లులు ఉండగా బాయిల్డ్ రైస్ మిల్లులు మరో నాలుగున్నాయి. ఈ మిల్లర్ల ద్వారా కూడా ధాన్యం కొనుగోలు చేస్తారు. కానీ వీరికి నిధుల సమస్య లేకపోయినా పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాల్సిన కేంద్రాలకు పెట్టుబడులను ఎక్కడి నుంచి తీసుకువస్తారో ఇప్పటికీ తేలలేదు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాత్రం మార్కెటింగ్ శాఖ నుంచి వీటిని ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రకటించినప్పటికీ వారికి ఈ వెసులు బాటు ఉందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.