కియా తొలి కారు ఆవిష్కరణలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాలగుండ్ల శంకర్‌నారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా, కియా ప్రతినిధులు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడ్ ఇన్ ఆంధ్రా తొలి కియా కారు మార్కెట్‌లోకి వచ్చింది. గురువారం పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇక్కడి ప్లాంట్‌లో తయారైన కియా ‘సెల్టోస్’ కారును రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. ఇప్పుటి వరకు 23 వేల కార్లు ప్రీబుకింగ్ కాగా.. వారందరికీ ఆగస్టు 22 నుంచి కార్లను అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
‘‘ఆటోమొబైల్ కంపెనీల ఏర్పాటుకు అనంతపురం జిల్లా అనువుగా ఉంది. జిల్లాలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ‘కియా’ పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ చూపారు. ‘కియా’ కంపెనీతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు రాయితీలు కల్పిస్తాం. కియా ఏర్పాటుతో ఇతర ఆటోమోబైల్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆకాంక్షిస్తున్నా. కచ్చితంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం. అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణనిస్తాం.’’ - ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అనంతపురం : పెనుకొండ ప్లాంట్‌లో తయారైన కియా తొలి కారు ‘సెల్టోస్’ మార్కెట్‌లోకి వచ్చింది. గురువారం కియా పరిశ్రమలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకర్‌నారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ సత్యనారాయణ తదితరులు కియా కారు సెల్టోస్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనివార్య కారణాలతో రాలేకపోయారు. ఆయన పంపిన సందేశాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించారు.
20 రోజుల్లోనే 23 వేల కార్ల బుకింగ్
‘కియా’ ఎండీ, సీఈఓ కూకుయన్ షిమ్ మాట్లాడుతూ.. కేవలం 20 రోజుల్లోనే 23 వేలకుపైగా కార్లు బుక్ కావడం సంతోషంగా ఉందన్నారు. సెల్టోస్ కారును ఆగస్టు 22వ తేదీ నుంచి వినియోగదారులకు డెలివరీ చేస్తామన్నారు. సౌత్ కొరియా అధికార ప్రతినిధి షిన్‌బాంగ్ మాట్లాడుతూ... గత ఎన్నికల్లో అఖండ మెజార్టీతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా గెలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువనేత నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతాయన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఇతర కొరియా కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు.
అన్ని విధాలా సహకరిస్తాం
తన నియోజకవర్గంలో ‘కియా’ కార్ల పరిశ్రమ రావడం ఎంతో సంతోషంగా ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. కరువు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయన్నారు. కంపెనీకి అవసరమైన సహకారాన్ని అన్ని విధాలా అందిస్తామని హామీనిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణలో అగ్రభాగాన ఉంటుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ ద్వారా సహకరిస్తామని... అయితే, 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా తెలిపారు. కియాలో కూడా స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వై. వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, పీవీ సిద్దారెడ్డి, ఎం.తిప్పేస్వామి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, గుర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ ప్రత్యేకతలు...!
దేశంలోని 8వ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ కియా... ఇండియాలో తన మొదటి కార్ల తయారీ యూనిట్‌ను అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ఏర్పాటు కోసం ఏప్రిల్ 2017లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. మొత్తం 536 ఎకరాల్లో ఏర్పాటైన ఈ యూనిట్ ద్వారా ఏడాదికి 3 లక్షల కార్లను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ కోసం రూ.11 వేల కోట్ల పెట్టుబడి పెట్టగా... 11 వేల మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
- జూలై 16వ తేదీన బుకింగ్స్‌ను ప్రారంభించారు. ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు 23,311 కార్లు బుక్ అయ్యాయి.
- దేశవ్యాప్తంగా 160 నగరాల్లో డీలర్లను ఏర్పాటు చేసుకున్నారు.
- ఆగస్టు 22వ తేదీ వినియోగదారులకు కారును డెలివరీ చేయనున్నారు.
- సెల్టోస్ కారును దేశంలోని వివిధ ప్రాంతాల్లో 20 లక్షల కిలోమీటర్ల మేర టెస్ట్ డ్రైవ్ చేసి పరీక్షించారు.
- బీఎస్–6 ప్రమాణాలు కలిగిన ఈ కారు ఏడు రంగుల్లో.. పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లల్లో లభిస్తుంది.
- కియా ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ఎలక్ట్రికల్, హైబ్రిడ్ కార్లను కూడా తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment