సాక్షి ప్రతినిధి, కర్నూలు: కొత్తగా లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న నయా మద్యం సిండి‘కేట్లు’ సరికొత్త దందాకు తెరతీశారు. నాలుగైదు షాపులకు ఫీజు కట్టి లక్కుతో దక్కించుకున్న షాపు కావడంతో వీరంతా సరికొత్త వ్యాపారం షురూ చేశారు. చెల్లించిన దరఖాస్తు ఫీజులను బెల్టు షాపుల నుంచి వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. లాటరీ పద్ధతిలో కేటాయించే మద్యం షాపులను దక్కించుకునేందుకు ఒక్కొక్కరు ఏకంగా 80 దరఖాస్తులను కూడా సమర్పించారు.
దరఖాస్తు ఫీజునకే భారీగా సమర్పించుకోవాల్సి వచ్చింది. ఒక షాపు దక్కించుకునేందుకు మిగిలిన అన్ని దరఖాస్తు ఫీజులను కోల్పోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న దరఖాస్తు ఫీజులను తిరిగి రాబట్టుకునేందుకు బెల్టు షాపుల నుంచి మాముళ్లు దండుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మద్యం షాపుల టెండర్లలో ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది. ఒక్కో షాపునకు ఏకంగా సగటున 300 దరఖాస్తులు దాఖ లయ్యాయి. మండలాల్లో అయితే రూ.30 వేలు, మునిసిపాలిటీల్లో రూ.40 వేలు, కర్నూలు కార్పొరేషన్‌లో ఒక్కో దరఖాస్తునకు రూ.50 వేలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అంటే ఒక మద్యం షాపును మండలాల్లో పొం దేందుకు ఒక వ్యక్తి 10 దరఖాస్తులు వేస్తే.. కేవలం దరఖాస్తుల రూపంలోనే రూ.3 లక్షలు కట్టాల్సిన పరిస్థితి. ఇన్ని దరఖాస్తులు చేస్తే వచ్చేది ఒక మద్యం దుకాణమే. మిగిలిన రూ.2.70 లక్షలను రాబట్టుకునేందుకు ఆదాయ వనరుగా బెల్టు షాపులను వేదికగా చేసుకున్నారు. అయితే, బెల్టు షాపులను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే వారికి మద్యం సిండికేట్లు ఏకంగా హామీల వర్షం కురిపిస్తున్నారు. బాటిల్‌పై ఏంత రేటుకైనా అధికంగా అమ్ముకోవచ్చని.. ఎక్సైజ్ అధికారులు దాడులు చేయకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ దాడులు జరిగితే అందుకు అనుగుణంగా కేసుల నుంచి కూడా రక్షణ కల్పించే బాధ్యతను భుజానికెత్తుకుంటున్నట్లు సమాచారం.
పాన్‌షాపు.. కూల్ డ్రింక్ షాపు.. కాదేదీ అనర్హం
బెల్టు షాపులన్నింటినీ తొలగించామని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నడవనివ్వమని ప్రభుత్వం చెబుతోంది. అయితే, జిల్లాలోని అన్ని గ్రామాల్లో బెల్టు షాపులు భారీగా నిర్వహిస్తున్నారు. పాన్‌షాపు.. కూల్ డ్రింక్ షాపు.. ఇతరత్రాల్లో యథేచ్ఛగా బాటిళ్ల గళగళ ఉంటోంది. తాజాగా బెల్టు షాపునకూ ఇంత మొత్తం వసూలు చేసి, దాడుల నుంచి కూడా హామీ ఇస్తున్న నేపథ్యంలో వీటి సంఖ్య జిల్లాలో మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా బాటిల్‌ను ఎంత ఎక్కువ ధరకైనా విక్రయించుకునే అవకాశం కల్పిస్తుండటంతో బెల్టుషాపుల వల్ల తమ ఇళ్లు గుళ్ల అవుతాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ కిక్కే వేరబ్బా!
Published Thu, Jul 9 2015 2:28 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM
Advertisement
Advertisement