కిడ్నాపైన బాలుడు విజయవాడలో సురక్షితం
Published Mon, Sep 2 2013 4:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు కిడ్నాపర్ల చెరనుంచి విజయవాడలో తప్పించుకున్నట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం తెలిపాడు. బాలుడి కుటుంబ సభ్యులు, సరుబుజ్జిలి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... ఎల్‌ఎన్‌పేట రోటరీనగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ, బుడ్డెమ్మలకు ఏకైక 13 ఏళ్ల వయసున్న కుమారుడు దుర్గాకామేశ్వరరావు అలియాస్ అప్పలనాయుడు ఆమదాలవలసలోని రవీంద్రభారతి స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 6.30, 7 గంటల మధ్యలో ఫోన్ తీసుకుని రోడ్డుమీదకు వెళ్లిన కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు.
విద్యార్థి సెల్‌కు అదేవీధిలో ఉంటున్న మల్లేశ్వరరావు 11 గంటల సమయంలో ఫోన్ చేయగా ‘తనను వ్యాన్‌తో వచ్చిన వ్యక్తులు మొఖంపై పౌడర్ చల్లి కిడ్నాప్ చేశారు. వారు రోడ్డుపక్కన వ్యాన్ ఆపి దాబాలో టిఫిన్ చేసేందుకు వెళ్లగా తప్పించుకున్నాను. ఇక్కడ మనుషులు, ఇళ్లు లేవు. ప్రస్తుతం వారికి దూరంగా ఉన్న తుప్పల్లో ఉన్నాను. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని సమాచారమొచ్చింది. ఆ తర్వాత స్విచాఫ్ అయింది. అనంతరం విజయవాడలో ఉన్నట్టు బాలుడు సమాచారమిచ్చాడు. దుర్గా కామేశ్వరరావు తండ్రి రైస్ మిల్లులో కలాసీగా, తల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తుంది. ఆమదావలస సీఐ వీరకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
Advertisement
Advertisement