ఇండియన్ ఎంబసీ, కంపెనీ ప్రతినిధులతో కిడ్నాపర్ల చెరనుంచి విడుదలైన యువకులు
సంతబొమ్మాళి: పొట్టకూటి కోసం లిబియా దేశానికి వెళ్లి అదృశ్యమైపోయిన శ్రీకాకుళం యువకులు ఎట్టకేలకు 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెరనుంచి బయటపడ్డారు. ప్రస్తుతం లిబియాలోని భారత దౌత్య కార్యాలయంలో వారు క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య ఉపాధి కోసం గతేడాది అక్టోబర్ 30న లిబియాకు వెళ్లారు. కొంతకాలం పాటు అక్కడి ఓ కంపెనీలో పనిచేశారు. గత నెలలో తిరిగి ఇండియా వచ్చేందుకు వారు సిద్ధమయ్యారు. 14వ తేదీన తమ కంపెనీ ఏర్పాటు చేసిన వాహనంలో త్రిపాలి ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. మార్గం మధ్యలో కొందరు దుండగులు వీరి వాహనాన్ని ఆపి కిడ్నాప్ చేశారు. మూడు రోజుల తర్వాత దుండగులు వీరిని మరో గ్యాంగ్‌కు అప్పగించారు.
ఆ గ్యాంగ్ సభ్యులు తాము కిడ్నాప్ చేసిన వారిని విడిచిపెట్టాలంటే 20 వేల డాలర్లు చెల్లించాలని కంపెనీ ప్రతినిధుల్ని డిమాండ్ చేశారు. అయితే వారు తర్జనభర్జనల్లో మునిగిపోయారు. ఈ సమాచారం తెలిసిన బాధితుల కుటుంబసభ్యులు డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి సీదిరి అప్పలరాజు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇండియన్ ఎంబసీని సంప్రదించి త్వరగా బాధితులను కిడ్నాపర్ల నుంచి విడిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ ఆ సొమ్మును చెల్లించడంతో సీతానగరం యువకులతో పాటు యూపీకి చెందిన ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాపర్లు విడిచిపెట్టారు. ప్రస్తుతం లిబియాలోని భారత దౌత్య కార్యాలయంలో ఉన్న వారంతా త్వరలో స్వదేశానికి రానున్నారు.
శ్రీకాకుళం యువకుల క్షేమసమాచారాన్ని తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సత్వరం స్పందించి తమ పిల్లల గురించి వాకబు చేసి, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment