సుఖాంతమైన భవానీ కథ! | Happy Ending To Bhavani Story | Sakshi
Sakshi News home page

సుఖాంతమైన భవానీ కథ!

Dec 8 2019 3:01 PM | Updated on Dec 8 2019 3:53 PM

Happy Ending To Bhavani Story - Sakshi

సాక్షి, విజయవాడ : నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 13 ఏళ్ల తర్వాత కన్నతల్లిదండ్రుల చెంతకు భవానీ చేరింది. ఆదివారం మీడియా సమక్షంలో పెంచిన తల్లిదండ్రులు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ తనకూ ఇద్దరూ తల్లులు ఇష్టమేనని, పదిరోజులు పెంచిన అమ్మ దగ్గర ఉంటే, మరో పది రోజులు కన్న తల్లి వద్ద ఉంటానని తెలిపింది. తనకు ఇప్పటివరకు కన్‌ఫ్యూజన్‌ ఉండేదని, ఇకనుంచి ఇద్దరి వద్ద ఉంటానని చెప్పింది. ప్రస్తుతానికి కన్న తల్లి వద్దకు వెళుతున్నట్టు తెలిపింది. కన్నవాళ్ళ వద్దకు వెళుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. భవానీ కనిపించడం సంతోషంగా ఉందని కన్నతల్లి తెలిపారు. తనను ఇన్నాళ్లు పెంచినందుకు జయమ్మ-జీవరత్నం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

కన్నబిడ్డలా పెంచాం!
భవానీని కన్నబిడ్డలా పెంచాం కానీ, ఆమె కన్న తల్లి వద్దకే వెళతానని చెబుతోందని పెంచిన తల్లి జయమ్మ తెలిపారు. ఆమె వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. అయినా పది రోజులకోసారి వస్తననడం సంతోషం కలిగిస్తోందన్నారు. పాప భద్రత కోసమే తాము డీఎన్ఏ టెస్ట్ కోరినట్టు తెలిపారు. పాప సంతోషమే తమకు ముఖ్యమన్నారు. భవానీ తమ కూతురని మళ్లీ వస్తారేమోనని టెన్షన్‌గా ఉందని, పాపను బాగా చూసుకోవాలని కోరుతున్నామని పెంచిన తండ్రి జీవరత్నం తెలిపారు.

13 ఏళ్ల క్రితం తప్పిపోయింది!
నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది భవానీ. అయినా చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల తర్వాత వారి జాడ తెలుసుకుంది.  శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. వారు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ  తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు  భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్‌ చేశాడు.

డీఎన్‌ఏ టెస్ట్‌.. ట్విస్ట్‌!
అయితే, భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని.. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు. అందుకోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని వెల్లడించారు. భవానీని అప్పగించే విషయంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. వచ్చినవారే నిజమైన తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యాకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భవానీ మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇందుకోసం ఏ పరీక్షలకైనా సిద్ధమేనని వెల్లడించారు. దీంతో ఈ వివాదం పటమట పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పోలీసులు పరిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement