
కిడ్నీ గండం
పక్క జిల్లా అయిన శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంత ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ, వారి కుటుంబాలను వీధిన పడేస్తున్న కిడ్నీ వ్యాధి ఇప్పుడు జిల్లాలో కూడా విజృంభిస్తోంది. ఏడాదికి సుమారు ఏడు వేల మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన తరువాత వైద్యం, డయాలసిస్ చేయించుకోడానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుండడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అవగాహన లోపం, నిర్లక్షం వల్లే జిల్లాలో ఈ వ్యాధి గ్రస్తులు పెరుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
విజయనగరంఆరోగ్యం: జిల్లాలో కిడ్నీ రోగుల సంఖ్య ఆందోళనకలిగించేలా పెరుగుతోంది. గతంలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యచాలా తక్కువగా ఉండేది. కాని ఆహారపు అలవాట్లలో మార్పులు, నిత్యం ఒత్తిడికి గురికావడంతో పాటు, వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, కలుషిత నీటి వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికి 5 వేల నంచి 7 వేల మంది వరకూ కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఏడాదికి 500 మంది వరకు వ్యాధి బారిన పడేవారు. కానీ ఇప్పుడా సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో అన్ని మండలాల్లోను కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బీపీ, మధుమేహం వల్లే 60 నుంచి 70 శాతం మందికి ఈ వ్యాధి సోకుతోంది. జిల్లాలో ప్రస్తుతం 25 వేల మంది వరకూ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరిలో కొంతమంది విశాఖపట్నంలో, మరి కొంత మంది విజయనగరం పట్టణంలోని కేంద్రాస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు.
కిటకిటలాడుతున్న డయాలసిస్ సెంటర్
జిల్లాలో కేంద్రాస్పత్రిలో ఒకటి, ప్రైవేటు ఆస్పత్రులో ఒక డయాలసిస్ సెంటర్ ఉన్నాయి. ఈ రెండు సెంటర్లు నిత్యం వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతున్నాయి. డయాలసిస్ చేయించుకోడానికి బాధితులు ఆస్తులు అమ్ముకోవలసి వస్తోంది. ఇంటి యజమానులకు కిడ్నీ వ్యాధి సోకడంతో పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
వ్యాధి సోకడానికి కారణాలు :
బీపీ, మధుమేహంలను అదుపులో ఉంచుకోలేకపోవడం, మలేరియా, డయేరియా వంటి వ్యాధులకు సకాలంలో చికిత్స చేయించుకోకపోవడం, కిడ్నీలో రాళ్లు, ఇన్‌ఫెక్షన్ పట్ల నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీ వ్యాధి సోకుతుంది. తీవ్ర ఒత్తిడి, కలుషత నీరు తాగడం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడతారు. మధుమేహం వల్ల 50 శాతం, బీపీ వల్ల 20 శాతం, కలుషిత నీరు తాగడం వల్ల 10 శాతం, కిడ్నీలో రాళ్లు, ఇన్‌ఫెక్షన్ వల్ల 10 శాతం, తీవ్ర ఒత్తిడి వల్ల ఈ వ్యాధి సోకుతోంది.
రోగుల అభిప్రాయాలు :
నాపేరు రామదాసు. మాది గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామం. నాకు కిడ్నీ వ్యాధిసోకి మూడు సంవత్సరాలైంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల, ఎక్కడపడితే అక్కడ నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి సోకిందని విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో మూడు ఏళ్ల క్రితం నిర్ధారించారు. అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను.
నా పేరు లక్ష్మి, మాది పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామం. నాకు కిడ్నీవ్యాధి సోకి ఐదు సంవత్సరాలైయింది. బీపీ ఉండడం వల్ల కిడ్నీ వ్యాధిసోకిందని వైద్యులు తెలిపారు.అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను