
మంచానికి పరిమితమైన గోపిరెడ్డి అంజిరెడ్డి
చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పటికే నలుగురు సంతానంలో ఇద్దరు మృత్యు ఒడికి చేరగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఎవరైనా కిడ్నీ దాతలు ఆదుకుంటే ఆ యువకుడు నిండు నూరేళ్లు బతుకుతాడు. లేదా ఆర్థిక సాయం చేసినా పెద్ద ఆస్పత్రి వారే క్నిడ్నీ సమకూర్చి ఆయుష్షు పోస్తారు. కానీ ప్రస్తుతం ఈ పేదల దగ్గర రెండు ఆప్షన్లకూ దిక్కు లేకపోవడంతో కుమారుడిని చూసి శోకిస్తున్నారు.
యర్రగొండపాలెం టౌన్ : యర్రగొండపాలెంలోని జామియా మసీదు వీధిలో నివాసం ఉంటున్న గోపిరెడ్డి ఈశ్వరమ్మ, రామిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం క్రితం ఒక కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరొక కుమార్తె అనారోగ్యంతో మరణించింది. రెండెకరాల పొలం ఉన్నప్పటికీ, వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి. సొంత ఇల్లు లేదు. దీంతో భార్యా భర్తలు కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు మగ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. పెద్ద కుమారుడు గోపిరెడ్డి అంజిరెడ్డి (21) 10వ తరగతి వరకు చదివి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నాడు.
అయితేగత సంవత్సరం దసరా పండగకు ముందు అంజిరెడ్డికి కాళ్ల వాపు, జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించినప్పటికీ, నయం కాక పోవడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లారు. అక్కడ అంజిరెడ్డికి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు రెండు కిడ్నీలు పనిచే యడం లేదని, డయాలసిస్ చేయాలని చెప్పారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో, మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ వైద్యశాలకు వెళ్లారు. అక్కడ అంజిరెడ్డికి మళ్లీ వైద్యపరీక్షలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ ఉచితంగా చేస్తామని, అయితే కిడ్నీ ఇచ్చేందుకు దాతలు అవసరమని చెప్పారు.
ఇది సాధ్యం కాకపోవడంతో హైదరాబాద్‌లోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వెళితే, కిడ్నీ కూడా తామే ఏర్పాటు చేస్తామని, ఇందుకు రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వీరి దగ్గర ఎందుకుంటుంది? దీంతో డయాలసిస్ చేయించుకుని మందులు వాడుతుండాలని చెప్పారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఎన్‌ఆర్‌ఐలో డయాలసిస్ చేయించుకుని మందులు వాడుతున్నారు.
డయాలసిస్‌కే బోలెడు ఖర్చు
ఒక్కసారి డయాలసిస్ చేయించుకోవాలం టే రూ. 2వేలు ఖర్చు అవుతాయి. వారంలో 3 సార్లు హాస్పిటల్‌కు వెళ్లి డయాలసిస్ చేయించుకునేందుకు, మందులు, రవాణా చార్జీలు మొత్తం కలిసి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇంత భారం మోయలేక ప్రస్తుతం మార్కాపురం ఏరియా వైద్యశాలలోనే ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు బాధితుడు తెలిపాడు. ఆపరేషన్ చేసి, కిడ్నీ అమర్చేంతవరకు ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. తన బ్లడ్ గ్రూప్ బీ–పాజిటీవ్ అని తన పరిస్థితి గ్రహించి, ఎవరైనా కిడ్నీ ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తే, ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ ఉచితంగా చేయించు అంజిరెడ్డి తెలిపాడు.
లేదా హైదరాబాద్‌లోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వెళితే కిడ్నీ కూడా వైద్యులే ఏర్పాటు చేస్తారని చెప్పాడు. కుమారుడి ఆరోగ్యపరిస్థితి చూసి, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు. ప్రభుత్వం కానీ దాతలు కానీ సహకరించి, తమ కుమారుడికి వైద్యం చేయించాలని అంజిరెడ్డి తల్లిదండ్రులు గోపిరెడ్డి ఈశ్వరమ్మ, రామిరెడ్డి వేడుకుంటున్నారు. వైద్య పరంగా లేదా ఆర్థికంగా సాయం అందించాలనుకున్న దాతలు సెల్ నంబరు 9701922801ను సంప్రదించవచ్చు. అంజిరెడ్డి గోపిరెడ్డి ఎస్‌బీఐ అకౌంట్ నంబర్ 34407845821, సీఐఎఫ్ నంబర్ 87851910505 కు సాయం చేయవచ్చు.

తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, రామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment