నడిరోడ్డుపై భార్యను నరికేశాడు | Killed his wife because of Extra dowry | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై భార్యను నరికేశాడు

Published Sat, Sep 9 2017 3:55 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

నడిరోడ్డుపై భార్యను నరికేశాడు - Sakshi

నడిరోడ్డుపై భార్యను నరికేశాడు

అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు
 
శృంగవరపుకోట రూరల్‌: కట్నంకోసం వేధించే ఓ భర్త.. కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై కిరాతకంగా హతమార్చి తానూ ఆత్మహత్యకు పాల్పడిన  ఘటన విజయనగరం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.  శృంగవరపుకోట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బండారు రమణమూర్తి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. విశాఖ జిల్లా పరవాడ మండలం ధర్మారాయుడుపేట గ్రామానికి చెందిన చేబోలు శ్రీనివాసరావు (40) విజయనగరం జిల్లా భీమసింగికి చెందిన ఉమాదేవిని 13 ఏళ్ల క్రితం పెళ్లాడాడు. 2008లో బతుకుదెరువు కోసం విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2012లో కొట్టాం హైస్కూల్‌లో ఉమాదేవి కాంట్రాక్టు పద్ధతిలో క్రాఫ్ట్‌ టీచరుగా చేరారు.

కొద్ది కాలం నుంచి ఉమాదేవిని అదనపు కట్నం కోసం శ్రీనివాసరావు వేధిస్తున్నాడని ఆమె తండ్రి కౌలూరి ఆనందరావు తెలిపారు. ఈ క్రమంలో వీరి మధ్య స్పర్థలు పెరగడంతో విడిపోయారనీ, ఉమాదేవి కొంతకాలంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోందని ఆనందరావు వివరించారు. శుక్రవారం విధులు ముగించుకొని ఉమాదేవి తోటి ఉపాధ్యాయుడు వెంకటరావుతో కలసి ద్విచక్ర వాహనంపై శృంగవరపుకోటకు వస్తుండగా బైక్‌పై వచ్చిన శ్రీనివాసరావు వారిని అడ్డుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఉమాదేవిని నరికేసి పక్కనే ఉన్న గోస్తనీనది వైపు పారిపోయాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రత్యక్షసాక్షి అయిన ఉపాధ్యాయుడు గూనూరు వెంకటరావు ద్వారా హత్య జరిగిన ఉదంతాన్ని పోలీసు అధికారులు హతురాలి తండ్రి ఆనందరావు, చామలాపల్లి వీఆర్‌ఓ గణేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి మృతితో పిల్లలు సహీశ్వరీదేవి, యశ్వంత్‌కుమార్‌ అనాథలుగా మిగిలారని మృతుల బంధువులు కన్నీళ్ల పర్యంతమవుతూ తెలిపారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement